(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఘోర దుర్ఘటన జరిగింది. వడోదర జిల్లాలోని పద్రా పట్టణ సమీపంలోని గంభీర అనే వంతెన బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో మహిసాగర్ నదిలో పడి చిన్నారి సహా 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో వంతెన మీద రద్దీ ఎక్కువగా ఉన్నదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 900 మీటర్ల పొడవున్న ఈ వంతెనలోని రెండు పిల్లర్ల మధ్య ఉన్న స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలి నీటిలో పడిపోయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో ఆ స్లాబ్ మీద ఉన్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు, ఓ ఆటోరిక్షా, మరో బైక్ నీటిలో పడిపోయినట్టు పేర్కొన్నారు. అప్పుడే స్లాబ్ చివరివరకూ వచ్చిన ఓ పెద్ద ట్యాంకర్ ప్రమాదకరంగా వేలాడిందని, మరో వాహనం కూడా ఇలాగే నిలిచిపోయిందని తెలిపారు. సెంట్రల్ గుజరాత్, సౌరాష్ట్రను గంభీర వంతెన కలుపుతుంది. తాజా ఘటనతో ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరమ్మతులు చేయకపోవడం వల్లే
గంభీర బ్రిడ్జి 1985లో ప్రారంభమయ్యిందని గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్ తెలిపారు. అయితే, వర్షాకాలం వచ్చినప్పటికీ.. బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అందుకే బ్రిడ్జి కూలిపోయిందని చెప్తున్నారు. గుజరాత్లో వంతెనలు కూలడం నిత్యకృత్యంగా మారిందని, మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనలో 141 మంది మరణించినప్పటికీ, అధికారుల్లో ఏ మాత్రం చలనం రావట్లేదని మండిపడుతున్నారు. గుజరాత్లో 2021 డిసెంబర్ నుంచి మూడు నెలలకొకటి చొప్పున అన్నట్టు గడిచిన నాలుగేండ్లలో 14 వంతెనలు కూలిపోయాయి.
ఇదేనా గుజరాత్ మాడల్?బీజేపీ సమాధానం చెప్పాలి: కేటీఆర్
గుజరాత్లో కుప్పకూలిన వంతెన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ మాడల్ మరోసారి బట్టబయలు అయిందని పేర్కొన్నారు. ‘డబుల్ ఇంజిన్ ఉన్న గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో వంతెనలు వరుసగా ఎందుకు కూలుతున్నాయి? వీటిపై ఎన్డీఎస్ఏ లేదా ఇతర భద్రతా సంస్థలు విచారణ జరుపుతాయా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదేనా మీరు గొప్పలు చెప్పుకునే గుజరాత్ ‘మాడల్’? ప్రజల ప్రాణాలు తీసే నిర్లక్ష్యంపై బీజేపీ సమాధానం చెప్పాలి! అని డిమాండ్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
అక్కడ వంతెనలు కూలడం సాధారణం.. ఎక్స్‌లో మాజీ మంత్రి హరీశ్
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): గుజరాత్ వడోదరలో మహిసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలి పదిమంది దుర్మరణం చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. బీజేపీ, ఎన్డీయే పాలిత బీహార్, గుజరాత్ రాష్ట్రాల్లో వంతెనలు కూలడం సర్వసాధారణంగా మారిందని, అయినా విచారణలు, చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. మేడిగడ్డలో మాత్రం రెండు పిల్లర్లు కుంగితే రెండ్రోజుల్లో ఎన్డీఎస్ఏ విచారణ పేరుతో పొలిటికల్ డైవర్షన్ చేస్తూ రాజకీయ ప్రేరేపిత రిపోర్టులను ఇచ్చారని మండిపడ్డారు. అదే ఎన్డీయే ప్రభుత్వం ఉన్న ఏపీలో ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నిర్మిస్తున్న పోలవరంలో డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం, గైడ్ బండ్ కొట్టుకుపోయినా విచారణ ఎందుకు లేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో కుప్పకూలిన ఎస్ఎల్బీసీ, సుంకిశాల, కొట్టుకుపోయిన వాటర్ పంప్‌హౌస్, పెద్దవాగుపైన ఎన్డీఎస్ఏ ఎందుకు రాలేదని నిలదీశారు.
గుజరాత్లో ఇటీవల కూలిన కొన్ని వంతెనలు