చొప్పదండి, ఫిబ్రవరి 9 : సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి 420 దొంగ హామీలిచ్చి ఓట్లు దండుకుని గద్దెనెకారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇటీవల గుమ్లాపూర్‌లో నిర్వహించిన సీఎం సభలో చొప్పదండి పట్టణానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే సత్యం గంగాధరలో కొత్త డిగ్రీ కాలేజీ మంజూరైందని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని అన్నారు. చొప్పదండిని అభివృద్ధి చేయాలని రూ.120 కోట్లు మంజూరు చేసినట్టు గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన 100 పడకల దవాఖానను ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు వినియోగంలోకి తీసుకు రావడం లేదని నిలదీశారు. 14 వార్డుల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.