Medaram | వరంగల్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తప్పటడుగులతో కండ్లుముందే ఆడుతుపాడుతూ తిరిగాడే తమ కొడుకు ఇక జీవితాంతం ఆడలేడని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆ బాలుడి తల్లిదండ్రుల దుఃఖానికి ఎవరు కారకులు? ఆడిపాడుతూ అమ్మానాన్నతో మురిపెం పంచే తాను మంచానికే ఎందుకు పరిమితమయ్యానో తెలియక నొప్పితో ఆ బాలుడు పడుతున్న బాధకు బాధ్యులెవరు? అమ్మవార్ల సన్నిధిలో పూజలు నిర్వహించిన ఆ పూజారి కొడుకు శాశ్వత వైకల్యానికి పాపం ఎవరిది? మేడారం మహాజాతర పనుల్లో జరిగిన నాణ్యతాలోపంతో చోటుచేసుకొన్న ఘటన ఓ పసిబాలుడి వైకల్యానికి దారితీసింది.
రికార్డు స్థాయిలో మేడారం పనులు చేసి చరిత్ర సృష్టించామని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ పనులు జరిగిన రెండు నెలలకే అభంశుభం తెలియని ఏడేండ్ల బాలుడికి ఒకకాలిని తొలగించి, మరో కాలికి రాడ్వేసి ఆ కుటుంబానికి బహుమానంగా ఇచ్చింది. గత నెల 25న ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క గద్దెకు అమర్చిన శిల ఒకటి మీదపడి ఏడేండ్ల బాలుడైన యువిన్ తీవ్రగాయాల పాలయ్యాడు.
సమ్మక్క పూజారుల్లో ఒకరైన సిద్ధబోయిన రమేశ్ కుమారుడు యువిన్పై గద్దె సుందరీకరణకు అమర్చిన శిల ఊడిపడింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బాధిత బాలుడిని ములుగు దవాఖానకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యచికిత్సల కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు అదే రోజు తరలించిన విషయం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది.
బాలుడు యువిన్ కాళ్లపై శిల (రాయి) పడటంతో ఎడమపాదం నుజ్జునుజ్జు కావడంతోపాటు కుడి కాలు విరిగింది. ఆ రోజు నుంచి వైద్యులు అనేక పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత రెండు కాళ్లకు శస్త్రచికిత్సలు చేశారు. కుడికాలికి ఆపరేషన్ చేసి రాడ్ వేశారు. ఎడమకాలికి పూర్తిగా రక్తప్రసరణ నిలిచిపోయిందని నిర్ధారించారు. విధిలేని పరిస్థితుల్లో గురువారం బాలుడి ఆరోగ్య పరిరక్షణ కోసం ఎడమకాలును (పాదం నుంచి మోకాలి కింది వరకు) పూర్తిగా తొలగించినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క దవాఖానకు వెళ్లి బాలుడిని పరామర్శించి, బాలుడి తల్లిదండ్రులు, బంధువులకు ధైర్యం చెప్పి అంతా తాము చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
తల్లుల ఆలయం, గద్దెల వద్ద ఏర్పాటు చేసిన రాతి శిలలు మూణ్నాళ్ల ముచ్చటగానే మారాయి. జాతర సమయంలో లక్షలాది మంది నిత్యం భక్తులు తరలివస్తున్న సమయంలోనే రాతి స్తంభాలు విరిగిపోవడంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. కోట్లాది రూపాయల ఖర్చుతో తెప్పించి రాతిశిలలను ఏర్పాటు చేశామని సర్కార్ గొప్పలు చెప్పుకోగా, నాలుగు రోజులకే అవి నాసిరకంతో విరిగిపోవడంతో అభాసుపాలైంది.
మేడారం మహాజాతర సందర్భంగా రేవంత్ సర్కార్ ఆగమేఘాలపై చేపట్టిన పనుల్లో నాణ్యత లోపిస్తున్నదని నిరుడు డిసెంబర్ నుంచే ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరిస్తూనే ఉన్నది. జాతర పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు రేవంత్ సర్కార్ తిలోదకాలు ఇచ్చిందని, ఆ క్రమంలోనే ‘తిరుగు వారానికే విరిగిపోతున్న శిలలు, మేడారంలో రాలిపోతున్న రాతికట్టడాలు’ అని, ఫిబ్రవరి 4న, ‘మేడిపండులా మేడారం కట్టడాలు!’ అని ఫిబ్రవరి 5న నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు ప్రచురించింది.కాంగ్రెస్ సర్కార్ చేసిన నిర్లక్ష్యానికి బాలుడు తన జీవితాంతం వైకల్యంతో ఉండవలసిందేనా? ఎవరో చేసిన పాపానికి తామెందుకు మూల్యం చెల్లించుకోవాలి? అని బాలుడి తల్లిదండ్రులు బాధపడుతున్నారు.
బాలుడిపై శిల ఊడిపడిన ఘటన జరిగినప్పటి నుంచి శస్త్రచికిత్స చేసి కాలు తొలగించే వరకు విషయం బయటికి తెలియకుండా గోప్యంగా ఉంచారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి మేడారంలోని పూజారుల సంఘం నుంచి కానీ, ఇతరుల నుంచి ఎటువంటి నిరసన వ్యక్తంకాకుండా, విషయం బయటికి పొక్కకుండా ఆ దవాఖాన వద్ద సర్కార్ కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసిందనే విమర్శలు వినిపించాయి. ఘటనపై సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఉండగా, బాలుడి తల్లి సర్కార్ తీరుపై శాపనార్థాలు పెడుతున్నది. మరోవైపు ‘అంతా పైనుంచి మానిటర్ చేస్తున్నారు. బయటికి ఎవరూ ఏమీ మాట్లాడొద్దు’ అని కాంగ్రెస్ నాయకులు హుకుం జారీ చేయడంతో దవాఖాన పరిసరాలు గంభీరంగా మారిపోయాయని తెలుస్తున్నది.