ఇండోర్: మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ జిల్లాలో గల బోర్సర్ గ్రామం వినూత్న తీర్మానం చేసింది. గ్రామంలో ఎవరైనా బహిరంగంగా బూతులు మాట్లాడితే రూ.500 జరిమానా వసూలు చేయాలని నిర్ణయించింది. అంతే కాకుండా అలాంటి వాళ్లతో అవసరమైతే వీధులు శుభ్రం చేయాలని నిర్ణయించింది. జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం ఈ తీర్మానాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని సంకల్పించింది.
6 వేల మంది నివాసితులు ఈ మేరకు ఈ నిబంధనను పాటిస్తామని ప్రమాణం చేశారు. గ్రామ సర్పంచ్ అంతర్ సింగ్, డిప్యూటీ సర్పంచ్ వినోద్ షిండే, సామాజిక కార్యకర్త అశ్విన్ పాటిల్ ఈ నిబంధనను రూపొందించారు. ‘12-13 ఏండ్ల పిల్లలు కూడా బహిరంగంగా బూతులు మాట్లాడుతున్నారు. రెండు, మూడు తీవ్రమైన వివాదాల్లో కొందరు వ్యక్తులు తల్లులు, అక్కా చెల్లెళ్లను ఉద్దేశించి బూతులు మాట్లాడారు. ఒకరు అసభ్యంగా మాట్లాడితే.. ఎదుటి వాళ్లు అలాంటి మాటలే మాట్లాడుతున్నారు. దీంతో దీనికి ముగింపు పలకాలని ఈ నిర్ణయం తీసుకొన్నాం’ అని సర్పంచ్ తెలిపారు.
తమ గ్రామ తీర్మానాన్ని 20 మంది వార్డు సభ్యులు పర్యవేక్షిస్తారని ఆయన తెలిపారు. ఈ తీర్మాన ప్రభావం అప్పుడే ఫలితాలను ఇస్తున్నదని.. స్థానికులు బహిరంగంగా బూతులు మాట్లాడేందుకు జంకుతున్నారని.. దీంతో మహిళలు సంతోషిస్తున్నారని ఆయన తెలిపారు. బూతులు మాట్లాడే వారికి నోటీస్ జారీ చేస్తామని ఆయన తెలిపారు. బూతులు మాట్లాడొద్దన్న తీర్మానం పోస్టర్లను గ్రామం అంతటా అతికించామని చెప్పారు.