న్యూఢిల్లీ, నవంబర్ 10: కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవచ్చని, అదే సరైన సమయమని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు. ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్ (నాసల్ వ్యాక్సిన్)ను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు బుధవారం వెల్లడించారు. కొవాగ్జిన్‌తో పోలిస్తే దీని ఉత్పత్తి సులభమని చెప్పారు.
నాసల్ వ్యాక్సిన్ ప్రాముఖ్యత గురించి ఆయన వివరిస్తూ.. దీని కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయని, కరోనా వైరస్ వ్యాప్తిని ఆపేందుకు ఇదొక్కటే మార్గమని ‘టైమ్స్ నౌ సమ్మిట్-2021లో పేర్కొన్నారు. ‘నాసల్ వ్యాక్సిన్‌ను మేము అభివృద్ధి చేశాం. కొవాగ్జిన్‌ను తొలి డోసుగా ఇచ్చి రెండో డోసుగా నాసల్ వ్యాక్సిన్‌ను ఇవ్వవచ్చు. ఇది వ్యూహాత్మకంగా, శాస్త్రీయంగా చాలా ముఖ్యమైనది. నాసల్ వ్యాక్సిన్‌ను రెండో డోసుగా అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని నిలువరించవచ్చు’ అని చెప్పారు.
మరోవైపు జికా వ్యాక్సిన్‌ను కూడా భారత్ బయోటెక్ సిద్ధం చేసినట్టు కృష్ణ ఎల్లా ప్రకటించారు. ప్రపంచంలో ఈ టీకాను అభివృద్ధి చేసిన తొలి సంస్థ తమదేనని తెలిపారు. దీనిపై తొలి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని చెప్పారు.