– వెంకటాపురం సబ్‌స్టేషన్‌కు మరో 2 మెగావాట్ల ప్లాంట్ అనుసంధానం
– ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు 11 మెగావాట్ల సౌర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం.
– ఎస్ఈ శ్రీనివాసాచారి
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 24 : పీఎం కుసుమ్ పథకం ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహిస్తూ సుస్థిర విద్యుత్ ఉత్పత్తి దిశగా టీజీఎన్పీడీసీఎల్ వేగంగా అడుగులు వేస్తోందని సూపరింటెండింగ్ ఇంజినీర్ ఇనుగుర్తి శ్రీనివాసచారి అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో పీఎం కుసుమ్ పథకం కింద ఏర్పాటు చేసిన మరో 2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను గురువారం గ్రిడ్‌కు విజయవంతంగా అనుసంధానం (సింక్రనైజేషన్) చేసినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే అనుసంధానించిన ఒక మెగావాట్ ప్లాంట్‌తో కలిపి వెంకటాపురం సబ్‌స్టేషన్ పరిధిలో మొత్తం 3 మెగావాట్ల సౌర విద్యుత్ గ్రిడ్‌కు అందుబాటులోకి వచ్చిందన్నారు. సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా సూర్యశక్తిని వినియోగించుకోవడంతో పాటు పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. సౌర విద్యుత్ ఉత్పత్తి పెరగడం వల్ల సంస్థకు అదనపు విద్యుత్ లభ్యత పెరిగి, స్థానిక విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు 25 సంవత్సరాలపాటు స్థిరమైన ఆదాయానికి అవకాశం లభిస్తుందని తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు పీఎం కుసుమ్ పథకం కింద ఐదు ప్లాంట్ల ద్వారా 11 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు శ్రీనివాసచారి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 55 సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా 93.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మిగిలిన ప్లాంట్ల పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, వాటిలో ఎక్కువశాతం రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
విద్యుత్ సబ్స్టేషన్ల సమీపంలోని ప్రభుత్వ భూములను గుర్తించి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ సన్నాహాలు చేస్తోందని శ్రీనివాసచారి తెలిపారు. ఇప్పటికే తిరుమలాయపాలెం, పెద్దగోపతి, తల్లాడ సబ్స్టేషన్ల వద్ద సంస్థ ఆధ్వర్యంలో ఒక్కో మెగావాట్ సామర్థ్యంతో సౌర విద్యుత్ ప్లాంట్ల పనులు చేపట్టినట్లు వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచుతూ భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర డివిజన్ డీఈ బండి శ్రీనివాసరావు, డీఈ (ఎంఆర్టీ) కిరణ్ చక్రవర్తి, హెచ్‌టీ ఏడీఈ రామకృష్ణ, కన్స్ట్రక్షన్ ఏడీఈ రామకృష్ణ, మధిర సబ్‌డివిజన్ ఏడీఈ ఎం.అనురాధ, ఎర్రుపాలెం సెక్షన్ ఏఈ జి.అనుష, ఏఈ సతీష్ తదితర విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.