రుద్రంపూర్, ఏప్రిల్ 02 : భక్తి శ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో రుద్రంపూర్లో గల శ్రీ గుండాల సాయమ్మ తల్లి ఆలయంలో చుక్క బోనం కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. “ఆపదల నుండి రక్షించు, వైపరీత్యాలను దూరం చేయి, మా కోరికలు నెరవేర్చు అమ్మ” అంటూ భక్తులు అమ్మవారిని ప్రార్థిస్తూ బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమం ఆలయ పూజారి రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. పూజారి ఇంటి నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీకే ఓసి వ్యాలీ రోడ్డులోని అమ్మవారి గుడి వరకు డప్పు వాయిద్యాల నడుమ, శివశక్తుల పూనకాలతో భక్తులు ఊరేగింపుగా చేరుకున్నారు. మార్గమంతా అమ్మవారి జై జైకారాలతో మారుమోగింది. గుడి వద్దకు చేరుకున్న అనంతరం భక్తులు చుక్క బోనం, ఘనంకుండ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి, పెద్ద సంఖ్యలో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ బోనాల వేడుకలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా, భక్తుల విశ్వాసం, అంకితభావం ప్రతిబింబించింది.

రుద్రంపూర్లో ఘనంగా బోనాల వేడుకలు