భార్య దూరమవ్వడాన్ని భరించలేక మద్యానికి బానిసైనట్లు వెల్లడించాడు బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్. ఏడాదిన్నర పాటు ప్రతిరోజూ రాత్రి ఫుల్ బాటిల్ తాగినట్లు చెప్పుకొచ్చాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల సందర్భంగా తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల గురించి వివరించాడు. “ఆ సమయంలో నేను తీవ్రమైన మానసిక వేదన అనుభవించా. ఆ వేదన నన్ను మద్యానికి బానిస అయ్యేలా చేసింది కూడా!” అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా మాట్లాడుతూ.. “నిజానికి నాకు మద్యం అలవాటు లేదు. సినిమాల్లో ఏదైనా సీన్ కోసం తాగాల్సి వస్తే.. ఒకట్రెండు సార్లు తీసుకున్నా అంతే!
కానీ, రీనా వెళ్లిపోయాక.. ఆ ఒంటరితనాన్ని, బాధను భరించలేకపోయా. ఆ రోజు నా జీవితంలో అత్యంత కష్టతరమైన రోజు. ఆ బాధను ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కాలేదు. అందుకే, ఆ రోజు రాత్రి ఇంట్లో ఉన్న మద్యాన్ని తాగా. అయితే, అది అక్కడితోనే ఆగలేదు. దాదాపు ఏడాదిన్నరపాటు ప్రతిరోజూ రాత్రిపూట ఒక ఫుల్ బాటిల్ తాగేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు ఆమిర్. అయితే, ఈ అలవాటు తనను మరింత పతనం చేస్తుందని ఆమిర్ త్వరగానే గుర్తించాడట. తాను ఇలాగే ఉంటే తన భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచించాడట. “పిల్లలు, నా కెరీర్ కోసం మద్యపానాన్ని పూర్తిగా వదిలేయాలని నిర్ణయం తీసుకున్నా! అప్పటి నుంచి మళ్లీ మందువైపు చూడలేదు” అంటూ వెల్లడించాడు.
ఇక ఆమిర్-రీనా ప్రేమ-పెళ్లి సినిమాకు ఏమాత్రం తీసిపోని కథ. ఇరుగుపొరుగున ఉండే వీళ్లిద్దరి మధ్య మొదలైన ప్రేమ.. 1986లో పెళ్లి పీటలెక్కింది. వీరిద్దరికీ జునైద్ ఖాన్, ఐరా ఖాన్ ఇద్దరు పిల్లలు. అయితే, మనస్పర్ధల కారణంగా 2002లో విడాకులు తీసుకున్నారు. 19 ఏళ్ల సుదీర్ఘ బంధానికి ముగింపు పలికారు. అయితే.. భార్యభర్తలుగా విడిపోయినా.. ఇప్పటికీ ఒకరినొకరు గౌరవించుకుంటూ స్నేహితులుగా ఉంటున్నారు. రీనాతో విడాకుల తర్వాత 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు ఆమిర్ ఖాన్.
2021లో ఆమెతోనూ విడిపోయాడు. కాగా, గతేడాది తన 60వ పుట్టినరోజు సందర్భంగా.. బెంగళూరుకు చెందిన స్టయిలిష్ట్ గౌరీ స్ప్రాట్‌ను తన గర్ల్ ఫ్రెండ్‌గా మీడియాకు పరిచయం చేశాడు ఆమిర్. ఇక వృత్తిపరంగా బాలీవుడ్లో ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో నటించాడు ఆమిర్ ఖాన్. 2022లో వచ్చిన ‘లాల్ సింగ్ చద్దా’ పరాజయం తర్వాత.. గతేడాది ‘సితారే జమీన్ పర్’ చిత్రంతో వెండితెరపై చివరిసారిగా కనిపించాడు. ప్రస్తుతం తన కొడుకు జునైద్ ఖాన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఏక్ దిన్’ చిత్రాన్ని ఆమిర్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నాడు.