హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): ప్రమాదకరమైన గడ్డి మందు పారాక్వాట్ లాంటి విషపూరిత రసాయనాలపై నిషేధం విధించడం ప్రజారోగ్య పరిరక్షణలో కీలక మైలురాయి అని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పేరొన్నారు. దేశవ్యాప్తంగా పారాక్వాట్ వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడాన్ని ఆయన స్వాగతించారు.
గతంలోనే తమ పోరాటాన్ని గుర్తించి కేంద్రం కంటే ముందే తెలంగాణ ప్రభుత్వం పారాక్వాట్ను నిషేధించిందని వినోద్ కుమార్ గుర్తుచేశారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలోని రైతాంగానికి, ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. పారాక్వాట్పై నిషేధం కోసం ఆయన ప్రముఖ వైద్యుడు మహేశ్రెడ్డితోపాటు పలు సామాజిక సంస్థలు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)తో కలిసి ఆయన ఏడాది కాలంగా నిరంతర పోరాటం చేశారు. ఈ ప్రయత్నాలు ఫలించి కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై వినోద్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.