హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్, సోమశిల నుంచి శ్రీశైలం వరకు నడిపిస్తున్న క్రూయి జ్ బోట్ సర్వీసును తెలంగాణ పర్యాటక శాఖ ఆపేసింది. ఈ ఏడాది ఆగస్టు 28న ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కాగా బోట్లు తిరిగే ప్రాంతాలు కొన్ని తమ పరిధిలో ఉన్నాయని, వాటికి టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లించాలని అటవీశాఖ అధికారులు లేఖ రాశారు. సాగర్ నుంచి శ్రీశైలం విహార యాత్రతో పాటు జలాశయం నుంచి నాగార్జునకొండకు వెళ్లే 14 కిలోమీటర్ల దూరం మొత్తం కూడా అటవీ వన్యప్రాణి విభాగం పరిధిలోనే ఉంది. ఈ రెండు టూర్లకు టికెట్ ధరలో 30 నుంచి 40 శాతం చెల్లిస్తే ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు కట్టాల్సి వస్తుంది. దీంతో ఈ ప్యాకేజీని తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ తాత్కాలికంగా నిలిపివేసింది. అటవీ శాఖతో చర్చల అనంతరం తిరిగి ప్రారంభించనున్నది.