చర్లపల్లి, నవంబర్ 28: పేద వైద్య విద్యార్థుల సంక్షేమానికి బీఎల్ఆర్ ట్రస్ట్ కృషి హర్షనీయమని హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. కాప్రా సర్కిల్, నాచారం డివిజన్ పరిధిలోని హైపర్ మార్ట్ ప్రారంభోత్సవంలో నందమూరి బాలకృష్ణ, బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నలుగురు పేద వైద్య విద్యార్థుల చదువుల నిమిత్తం బీఎల్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫీజులకు సంబంధించిన చెక్కులను అందజేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ, పేద వైద్య విద్యార్థులకు ఫీజులను మొత్తం బీఎల్ఆర్ ట్రస్ట్ చెల్లించడం అభినందనీయమని, వైద్య విద్యార్థులకు బాసటగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిలబడటం హర్షనీయమన్నారు.
ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని పేద విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రధానంగా వైద్య విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్ట్ ఫీజులను చెల్లిస్తుందన్నారు. అదే విధంగా విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి శిక్షణ తరగతులను గతంలో ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులను ఆదుకోవడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని నందమూరి బాలకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో నాచారం, మల్లాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు శాంతి సాయిజెన్ శేఖర్, పన్నాల దేవేందర్ రెడ్డి, నాయకులు ప్రవీణ్ ముదిరాజ్, సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు.