హైదరాబాద్,జూలై 12 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నేతల రక్తాన్ని పొలాల్లో చల్లుతానన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్టు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. ‘రేవంత్‌రెడ్డి 3వ పేజీలో
రక్తదాహానికి రక్తదానం’ పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని తెలంగాణ భవన్లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలపై సీఎం ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు.
రైతుల కోసం ప్రాణత్యాగానికైనా తాము సిద్ధమేనని, సీఎం కోరుకున్నట్టుగానే తమ రక్తాన్ని ఇవ్వడానికే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. వృథాగా దిగువకు వెళ్తున్న గోదావరి జలాలను కన్నెపల్లి పంపుల ద్వారా రిజర్వాయర్లకు తరలించాలని, తెలంగాణ రైతులకు సాగునీరు, హైదరాబాద్ ప్రజలతోపాటు మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు తాగునీటిని అందించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నదని తెలిపారు. రక్తదాన శిబిరంలో పార్టీ, యువజన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.