హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ‘విశ్రాంత ఇంజినీర్లు ఉద్యమకారులు, విలువైన సలహాలిచ్చారని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే పొగిడారు. నాలుగు రోజుల క్రితం కూడా ప్రస్తావించారు. కానీ ఇప్పుడు పార్టీలకు అంటగడుతూ, జైల్లో వేస్తానని ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా. విశ్రాంత ఇంజినీర్లకు ఏ పార్టీతోనూ సంబంధం లేదు. ఎల్ నినో నేపథ్యంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యానే లేఖ రాసినం. నీళ్లు ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సూచించినం’ అంటూ తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మరోసారి స్పష్టంచేశారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి సైతం ఎన్నో సలహాలు ఇచ్చామని, ఆయన ఏనాడూ ఒక్క మాట అనలేదని, పార్టీలకు అంటగట్టలేదని, పిలిపించి తాము లేవనెత్తిన సమస్యలపై మాట్లాడారని గుర్తుచేసుకున్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చ ని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. లేఖ రాసిన విశ్రాంత ఇంజినీర్లపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిప్పు లు చెరిగారు. ‘తెలంగాణ మేధావుల ముసుగులో కన్నెపల్లి మోటర్లు వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసిన రిటైర్డ్ ఇంజినీర్లను బొకలో వేయాలి. నాకు బేవకూఫ్ సలహాలిస్తున్నరు.
వాళ్లను బొకలో వేయకపోవడమే నేను చేసిన తప్పు. రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్లకు, సూపర్ ఎల్ నినో వస్తుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్మెంటివ్వాలి’ అంటూ పరుష పదజాలంతో పత్రికాముఖంగా తూలనాడిన విషయం విదితమే. సీఎం వ్యాఖ్యలపై తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి స్పందించారు. ఆయా అంశాలపై ఓ టీవీ చానల్‌తో మాట్లాడారు. విశ్రాంత ఇంజినీర్లు నిష్ణాతులు, తెలంగాణ ఉద్యమకారులని, ఏమీ ఆశించబోరని, విలువైన సలహాలు ఇచ్చారంటూ గతంలో ఎన్నోసార్లు సీఎం రేవంత్‌రెడ్డే తమను పొగిడారని గుర్తుచేశారు. ఆయనే ఇప్పుడు తమను చర్లపల్లి జైల్లో వేస్తామని బెదిరించడం బాధ కలిగించిందని చానల్ లైవ్‌లోనే కన్నీటిపర్యంతమయ్యారు.
‘మేము ఏ రాజకీయ పార్టీకీ చెందిన వాళ్లం కాదు. కేవలం రైతుల ప్రయోజనాల దృష్ట్యా సాంకేతిక సలహాలు మాత్రమే ఇస్తున్నం. ప్రభుత్వ సర్వీసులో ఎంతో నిబద్ధతతో పనిచేసిన మమ్మల్ని చర్లపల్లి జైలుకి పంపుతామనడం చాలా బాధాకరం’ అని కన్నీటిపర్యంతమయ్యారు. విశ్రాంత ఇంజినీర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞత వదిలేస్తున్నానని వివరించారు. అమెరికన్ అసోసియేషన్ తదితర నివేదికల ప్రకారం ఎల్ నినో నేపథ్యంలో తెలంగాణలో తీవ్ర కరువు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతాంగం, ప్రజల కోసమే నీటి లభ్యత ఉన్న కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తూ లేఖ రాశామని గుర్తుచేశారు. అవసరమైతే తాము స్వచ్ఛందంగా సేవలు అందిస్తామని వెల్లడించామని వివరించారు.
గతంలో కాళేశ్వరం మూడో టీఎంసీ అంశం లో కేసీఆర్‌కు సైతం సూచనలు చేశామని, నివేదికలు ఇచ్చామని, ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన పత్రికల్లో అవి వార్తలుగా వచ్చాయని, కానీ కేసీఆర్ ఏనాడూ విశ్రాంత ఇంజినీర్లను ఒక్క మాట అనలేదని గుర్తుచేశారు. తమను ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అంటగట్టలేదని తెలిపారు. తాము నివేదించిన సమస్యలపై చర్చించారని, అధికారులకు సూచనలు చేశారని వివరించారు. నిస్వార్థ సేవలు అందించిన తమను నేడు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీతో అంటగట్టడం ఎంతవరకు సమంజసమని అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఇక మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించవద్దని విశ్రాంత ఇంజినీర్లు చెప్పారని సీఎం రేవంత్‌రెడ్డి ఇంతకాలం చేస్తున్న ప్రచారం సైతం మరోసారి పచ్చి అబద్ధమని తేలిపోయింది. ఈ విషయం పైనా శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి స్పష్టత ఇచ్చా రు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి నాడు కేసీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. 150 మీటర్లకైనా ఒప్పుకోవాలని మహారాష్ట్ర సర్కార్‌తో చర్చించారని తెలిపారు. కానీ 148 మీటర్లకు మించి ఒప్పుకొనేది లేదని మహారాష్ట్ర కరాఖండిగా తేల్చిచెప్పిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో నాడు కేసీఆర్ విశ్రాంత ఇంజినీర్లు, సర్వీస్ ఇంజినీర్లతో కమిటీ వేశారని, ప్రత్నామ్నాయం చూడాలని సూచించారని గుర్తుచేశారు.
అదే సమయంలో వ్యాప్కోస్‌తో సర్వే చేయించారని, గోదావరిపై సిరీస్ ఆఫ్ బరాజ్‌లను నిర్మించి జలాలు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. విశ్రాంత ఇంజినీర్ల తరఫున వేమనపల్లి వద్ద బరాజ్ నిర్మించాలని సూచనలు చేశామని, మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్‌మానేరుకు నీరు తరలించడాన్ని మాత్ర మే వ్యతిరేకించామని వివరించారు. అదే స మయంలో తమ్మిడిహట్టి వద్ద సరిపోను నీళ్లు రావని సీడబ్ల్యూసీ చెప్పిందని గుర్తుచేశారు.
దేశంతో పాటు తెలంగాణపై ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నదని, వాతావరణం చూస్తే వర్షాలు లేక ఎండలు మండిపోతున్నాయని శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. అమెరికన్ సొసైటీ సర్వే ప్రకారం తెలంగాణ తీవ్ర కరువును ఎదురోవాల్సి వస్తుందని, ఇలాంటి సమయంలో ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకురావడమే దిక్కని కుండబద్దలు కొట్టినట్టు చె ప్పారు. ప్రాణహితలో లక్ష క్యూసెకులకు పై గా ప్రవాహం ఉన్నదని, పంపులు నడువడానికి 93.5 మీటర్ల మినిమమ్ డ్రా డౌన్ లెవెల్ సరిపోతుందని, 10 పంపులు రన్ చేసినా రో జుకు 2 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి పంపించుకోవచ్చని వివరించారు. కరువు పరిస్థితుల్లో ఎన్డీఎస్ఏను సంప్రదించి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని, నిపుణుల పర్యవేక్షణలో పం పులు నడిపి నీటిని ఎత్తాలని స్పష్టంచేశారు.
విశ్రాంత ఇంజినీర్లపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లు నిప్పులు చెరుగుతున్నారు. సర్వీసుతోపాటు, ఉద్యోగ విరమణ పొందిన అనంతరం కూడా తెలంగాణ కోసం నిస్వార్థ సేవలు అందిస్తున్నారని వివరించారు. విశ్రాంత ఇంజినీర్ల కృషి ఫలితంగానే తెలంగాణకు సంబంధించి అనేక ప్రాజెక్టులు పురుడు పోసుకున్నాయని గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ఆధారాలతో తెలంగాణ సమాజం ముందుపెట్టింది విశ్రాంత ఇంజినీర్లేనని తెలిపారు. నిస్వార్థ సేవలు అందిస్తున్న విశ్రాంత ఇంజినీర్లను తూలనాడటం, చర్లపల్లి జైలులో వేస్తామనడం సీఎం హోదాలో దుర్భాషలాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
గతంలోనూ రేవంత్‌రెడ్డి ఇదే తరహాలో అనేకసార్లు నోరుపారేసుకున్నారని గుర్తుచేశారు. 80వ దశకానికి దగ్గరలో ఉన్నప్పటికీ రాత్రింబవళ్లు రాష్ట్రాభివృద్ధికి శ్రమపడుతున్న, ఎత్తిపోతల పథకాల నిపుణులు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు కే పెంటారెడ్డిపై అనుచిత వాఖ్యలు చేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లపైనా అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడుతున్నారు. తమ ప్రజాప్రభుత్వం నిపుణుల సలహాలు పాటిస్తుందని, అందరికీ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంటుందని నిత్యం గొప్పలు చెప్పే రేవంత్‌రెడ్డి, ఆచరణలో సలహాలిస్తున్న వారిపై బెదిరింపులకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వమని నిలదీస్తున్నారు. ఇకనైనా ఇంజినీర్లకు సీఎం రేవంత్‌రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
కరువు నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్పై విమర్శలు చేయబోయి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అభాసుపాలయ్యారు. ‘నీళ్లు ఎత్తకపోవడం వల్లే ఎల్ నినో వచ్చిందా?’ అంటూ ఎదురు ప్రశ్నలకు దిగారు. మాజీ సీఎం కేసీఆర్ బయటకు వచ్చి చెప్పాలని, అప్పుడే తాము సమాధానం చెప్తామని వివరించారు. ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.