Fire accident : అయోధ్య (Ayodhya) లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. శుక్రవారం శ్రీరామ నవమి (Sri Ram Navami) సందర్భంగా ఏర్పాటు చేసిన మహా యజ్ఞశాలలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరయూ నది (Sarayu river) తీరంలోని జమ్తారా ఘాట్ వద్ద నిర్వహించిన శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. యజ్ఞం ముగిసిన మరుసటి రోజే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.
యజ్ఞశాలలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక ఎకరం విస్తీర్ణంలో వెదురు, గడ్డితో నిర్మించిన మండపం క్షణాల్లో కాలి బూడిదయింది. కాగా ప్రమాద సమయంలో యూపీ రవాణా మంత్రి దయాశంకర్ సింగ్, పలువురు ఉన్నతాధికారులు అక్కడే ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆరు అగ్నిమాపక యంత్రాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. యజ్ఞ గుండంలోని నిప్పురవ్వలు ఎగిసి పడటం వల్లనే మండపానికి మంటలు అంటుకుని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రమాదంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. యజ్ఞ నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఇంతటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించారని ఆరోపిస్తున్నారు. కేవలం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో భద్రతా ఏర్పాట్లను గాలికి ఒదిలేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ భారీ కార్యక్రమం వెనుక ఉన్న ఆర్థిక వనరులు, మానవ వనరుల వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
Ayodhya UP – A sudden and massive fire erupted today during the concluding day of the grand 1251-Kund Mahayagya being held at Rajghat in Ayodhya. pic.twitter.com/HSwCumbFNh
— NextMinute News (@nextminutenews7) March 28, 2026