అమరావతి : రాజధాని అమరావతి( Amaravati ) చట్టబద్ధతకు అసెంబ్లీ తీర్మానం హర్షణీయమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) తెలిపారు. శనివారం ఏపీ అసెంబ్లీ ( AP Assembly ) లో చట్ట సవరణ తీర్మానంపై ప్రత్యేక సమావేశం నిర్వహించడంపై ఆమె ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. చట్టబద్ధతకు సెక్షన్ 5 సవరణకు కేంద్రాన్ని కోరడం న్యాయబద్ధమేనని పేర్కొన్నారు.
మళ్లీ జగన్ లాంటోళ్లు వస్తే అని ముందుచూపు ఉండడం మీ విజన్ కి నిదర్శనం అనుకున్నా, రాజధాని కోసం విభజన చట్టంలో పెట్టిన సెక్షన్ 94(3) సంగతేంటని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. సెక్షన్ 94(3) కింద అమరావతి ఫండ్స్ అడిగేందుకు తీర్మానం ఎందుకు చేయడం లేదని , గెజిట్తోనే అమరావతి గెయిన్ అవుతుందా ? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని నరేంద్ర మోదీకి తెలియదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎంతైతే అంత కేంద్రం నిధులు ఇవ్వాల్సిందే అనే క్లాజ్ సెక్షన్ 94(3డీ) చదవలేదా ? . కేంద్రం చేస్తున్న మోసంపై అసెంబ్లీ తీర్మానం వద్దా ? నిధులు హక్కుగా ఇవ్వాల్సిందేనని తీర్మానం ఎందుకు చేయడం లేదని నిలదీశారు. విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడుస్తుంటే అసెంబ్లీ వేదికగా తీర్మానం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి పట్టే రూ.1 లక్ష కోట్లు ప్రజల నెత్తిమీద వేస్తారా ? . ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన సంధిస్తున్న ప్రశ్నలపై కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అసెంబ్లీ వేదికగా సమాధానం చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.