న్యూఢిల్లీ, జనవరి 20: లోక్సభ ఎన్నికలు, ఇతర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2024-25 సంవత్సరంలో ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ రూ.3,335.36 కోట్లు ఖర్చు చేసినట్లు ఆ పార్టీ వార్షిక ఆడిట్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను బీజేపీ ఎన్నికల కమిషన్కు సమర్పించింది. 2019-20 సంవత్సరంలో 17వ లోక్సభ, ఏడు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కోసం రూ.1,352.92 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ అంతకు రెండున్నర రెట్లు అధికంగా 2024-25 (18వ లోక్సభ) ఎన్నికల కోసం ఖర్చు చేసింది. 2024 లోక్సభ ఎన్నికలను ఆ ఏడాది మార్చి 16న ఎన్నికల కమిషన్ ప్రకటించగా అంతకు ముందు ఆర్థిక సంవత్సరం నుంచే ప్రచార కార్యకలాపాలు మొదలయ్యాయి. 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 44 రోజుల పాటు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికలకు ముందు ఆర్థిక సంవత్సరం 2023-24లో ఎన్నికలు, సొంత ప్రచారం కోసం బీజేపీ 1,754.06 కోట్లు ఖర్చు చేసింది.
గత ఎన్నికల కంటే రెట్టింపు ఖర్చు
18వ లోక్సభ ఎన్నికలు, 8 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు సంవత్సరం, ఎన్నికలు జరిగిన సంవత్సరంలో ఎన్నికలు, సాధారణ ప్రచారం కోసం బీజేపీ ఖర్చు చేసిన మొత్తం వ్యయం రూ. 5,089.42 కోట్లు. 17వ లోక్సభ ఎన్నికలు, 7 అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు రెండు సంవత్సరాల్లో ఖర్చు చేసిన రూ. 2,145.31 కోట్లతో పోలిస్తే ఇది రెట్టింపు కన్నా అధికం. 2025 డిసెంబర్ 27న ఎన్నికల కమిషన్కు బీజేపీ తన వార్షిక ఆడిట్ నివేదికను సమర్పించగా దాన్ని ఈసీ ఈ వారం ప్రచురించింది. 2024-25లో బీజేపీ చేసిన మొత్తం ఖర్చు రూ. 3,774.58 కోట్లలో ఎన్నికల కోసం ఖర్చు చేసింది 88 శాతమని తేలింది. ఎన్నికలు, సాధారణ ప్రచారం కోసం జరిగిన మొత్తం వ్యయంలో 68 శాతం అంటే రూ. 2,257.05 కోట్లు ప్రకటనలు, ప్రచారం కోసం బీజేపీ ఖర్చు చేసింది.
ఎలక్ట్రానిక్ మీడియా కోసం అత్యధికంగా రూ.1,124.96 కోట్లు ఖర్చు చేయగా ఆ తర్వాత వరుసగా ప్రకటనల కోసం రూ.897.42 కోట్లు ఖర్చు చేసింది. అంతేగాక ఎన్నికల ప్రచారం నిమిత్తం విమానాలు, హెలికాప్టర్లలో తిరిగినందుకు రూ. 583.08 కోట్లు ఖర్చయినట్లు బీజేపీ తన ఆడిట్ నివేదికలో పేర్కొన్నది. ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థులకు రూ. 312.90 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందచేసినట్లు కూడా బీజేపీ తన ఆడిట్ రిపోర్టులో వెల్లడించింది. మిగిలిన పార్టీల విషయానికి వస్తే 2024-25 సంవత్సరంలో ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రూ.896.22 కోట్లు ఖర్చు చేసింది. 2023-24లో రూ. 619.67 కోట్లు ఖర్చు చేసినట్లు ఈసీకి సమర్పించిన కాంగ్రెస్ ఆడిట్ నివేదిక పేర్కొన్నది.
పెరిగిన పార్టీ ఆదాయం
బీజేపీ వార్షికాదాయం గత రెండేండ్లలో చాలా వేగంగా పెరిగింది. 2023-24లో రూ. 4.340.47 కోట్లు ఉన్న బీజేపీ మొత్తం ఆదాయం 2024-25లో రూ. 6,769.17 కోట్లకి పెరిగింది. స్వచ్ఛంద విరాళాల ద్వారా రూ. 6,124.85 కోట్లు లభించగా మిగిలిన ఆదాయం సభ్యత్వ రుసుములు, బ్యాంక్ వడ్డీ, ఇతర వనరుల ద్వారా సమకూరినట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన తర్వాత వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరం 2024-25 కావడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బీజేపీ వార్షికాదాయం నిరుటి సంవత్సరంతో పోలిస్తే 54 శాతం పెరుగడం విశేషం.
