BJP Parliamentary Board | బీజేపీలో విధాన నిర్ణాయక సంస్థ పార్లమెంటరీ బోర్డు నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు ఉద్వాసన పలికారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే కర్ణాటకలో సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లకు చోటు దక్కింది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో యూపీలో రెండోసారి అధికారంలోకి రావడానికి కారణమైన సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు కూడా చోటు దక్కలేదు. తొలిసారి బీజేపీ పార్లమెంటరీ బోర్డులోకి సిక్కు నేతతోపాటు ఆరుగురికి అవకాశం కల్పించారు. అంతేకాదు.. రాజకీయంగా తరం మార్పిడి తీరు స్పష్టంగా కనిపిస్తున్నది.
అన్నింటికంటే గమ్మత్తైన విషయమేమిటంటే ఆరెస్సెస్‌కు అత్యంత సన్నిహితుడు నితిన్ గడ్కరీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగింది. ఇటీవలి కాలంలో తమ ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు నితిన్ గడ్కరీ. రాజకీయాల నుంచి వైదొలగాలని అనిపిస్తుందని ఇటీవలే నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను తొలగించడంతో పార్లమెంటరీ బోర్డులో సీఎంలకు చోటు లేకుండా పోయింది. మహారాష్ట్రలో శివసేనలో తిరుగుబాటును ప్రోత్సహించి, సీఎం ఏక్నాథ్ షిండేతోపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చోటు కల్పించడం గమనార్హం.
కర్ణాటకలో బలమైన సామాజిక వర్గ నేత యెడియూరప్పకు చోటు కల్పించడంలో కమలనాథులు ముందుచూపుతో వ్యవహరించారు. వచ్చే ఏడాది సీఎం బస్వరాజు బొమ్మై సారధ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు యెడియూరప్ప సహకరాం అవసరం. కర్ణాటకలో లింగాయత్‌లు 18 శాతం మంది ఓటర్లు ఉన్నారు.
అసోంలో సీఎంగా హిమంత బిశ్వ శర్మకు చోటు కల్పించడానికి పక్కకు తప్పుకున్న ఆ రాష్ట్ర మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌కు చోటు లభించడం ఆసక్తికర పరిణామం. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు చోటు లభించింది.
బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ఉన్న వారికి ఆటోమేటిక్‌గా పార్టీ ఎన్నికల కమిటీలో చోటు దక్కుతుంది. ఇప్పటి వరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉన్న ఏకైక ముస్లిం నేత షానావాజ్ హుస్సేన్‌ను తప్పించారు. దీంతో కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా గానీ, ఎంపీగా గానీ, మరే ఇతర పోస్ట్‌లో గానీ ముస్లిం నేతలు లేరు. ఇటీవల రాజ్యసభ గడువు ముగియడంతో కేంద్ర మంత్రిగా ముక్తార్ అబ్బాస్ నక్వీ రాజీనామా చేశారు.