హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): సింగరేణి, నైని కోల్ టెండర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల కాలం నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. గతంలో దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి ప్రకటించిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో వెల్లడించాలని, వచ్చిన ఉద్యోగాలు ఎన్నో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో రెండుసార్లు దావోస్ పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీజేపీ అగ్రనేతలతో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒకటి చొప్పున ఐదు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.