భారత మాజీప్రధాని, బహుభాషా కోవిదుడు స్వర్గీయ పీవీ నరసింహారావు రచించిన ప్రఖ్యాత కథ ‘గొల్ల రామవ్వ’ అదే పేరుతో ఓటీటీలో సినిమాగా రాబోతున్నది. తాళ్లూరి రామేశ్వరి టైటిల్ రోల్‌ని పోషించారు. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో సాగే ఈ కథకు ముళ్లపూడి వరా దర్శకత్వం వహించారు. సుచేత డ్రీమ్ వర్క్ ప్రొడక్షన్, వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రామ్ విశ్వాస్ హనూర్కర్, రాఘవేంద్రవర్మ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 25 నుంచి ఈటీవీ విన్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ఈ వేడుకకు పీవీ నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కుమారుడు పీవీ ప్రభాకర్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సురభి వాణీదేవి మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే చిన్నతనంలో మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన రజాకార్ల కథలు గుర్తొచ్చాయని, నాటి అకృత్యాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారని అన్నారు. ఈ సినిమా తెలంగాణ సాయుధ పోరాటంలోని త్యాగాలను నేటి తరానికి పరిచయం చేస్తూ, చరిత్ర పుటల్లోకి తీసుకెళ్తుందని, గొల్ల రామవ్వ వీరత్వాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారని ఆమె కొనియాడారు.
అప్పట్లో ప్రతీ పల్లెలో, ఇంటిలో ఓ గొల్లరామవ్వ ఉండేదని గీత రచయిత కాసర్ల శ్యామ్ చెప్పారు. 30 నిమిషాల నిడివితో సాగే ఈ మినీ మూవీలో కథలోని సమస్త భావోద్వేగాలను ఆవిష్కరించామని దర్శకుడు ముళ్లపూడి వరా పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: గంగమోని శేఖర్, సంగీతం: సాయి మధుకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజహర్షేక్, రచన: బయ్యవరపు రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముళ్లపూడి వరా.