ప్రత్యేక గీతాల్లో అగ్ర కథానాయికలు భాగం కావడం ఇప్పుడు పరిపాటిగా మారింది. దాదాపు అన్ని భాషా చిత్రాల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తున్నది. కేవలం మూడునాలుగు రోజుల కాల్షీట్కే భారీ రెమ్యునరేషన్స్ పొందే వీలుండటం, యువతలో ఆ తరహా పాటలకు ఉన్న క్రేజ్ దృష్ట్యా అగ్ర తారలు ఐటెంసాంగ్స్‌కు సై అంటున్నారు. తాజాగా ఈ వరుసలో మరాఠీ సుందరి మృణాల్ ఠాకూర్ చేరిందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ప్రత్యేక గీతంలో నర్తించనుందనే టాక్ వినిపిస్తున్నది.
ఇప్పటికే మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరిపారని, పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రెస్జేజియస్ మూవీ కావడంతో ఈ సొగసరి ఐటెంసాంగ్‌కు వెంటనే ఓకే చెప్పిందని ఫిల్మ్‌నగర్ టాక్. భారీ హంగులతో ఈ పాటను తెరకెక్కిస్తారని తెలిసింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ ఇప్పటికే హుషారైన బీట్తో ట్యూన్ సిద్ధం చేశారని అంటున్నారు. ‘సీతా రామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హిందీ, తెలుగు భాషల్లో బిజీగా ఉంది. తెలుగులో అల్లు అర్జున్-అట్లీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లో ఈ భామ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.