హైదరాబాద్ జూలై 11 (నమస్తే తెలంగాణ) : ‘భద్రాద్రి రాములోరి భూములను ఆక్రమించుకుంటే నోరు తెరవరా? ఆలయ స్థలాలు అన్యాక్రాంతమవుతుంటే ఒక్క మాటైనా మాట్లాడరా? మీ భాగస్వామి సర్కారు చెరలో ఉన్నాయని వదిలేస్తున్నారా? లేక భద్రాద్రినే గంపగుత్తగా అప్పజెప్పుతరా?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మోదీతో మాట్లాడతారో? మీ దోస్తుకు మోకరిల్లుతారో మీ ఇష్టం. భద్రాద్రిని కాపాడండి.. అన్యాక్రాంతమైన భూములను ఆక్రమణ దారుల చెర నుంచి విడిపించండి’ అని శుక్రవారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ఓట్ల కోసం చేసే మీ రామ జపాలను, సీట్ల కోసం ఆడే మీ దొంగ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, మోసం చేస్తే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
తెలంగాణ బిడ్డల ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాబ్ జంగ్ బహదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. శుక్రవారం నవాబ్ జంగ్ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన గొప్పతనాన్ని కేటీఆర్ పంచుకున్నారు. తెలంగాణ ఇంజినీర్లందరికీ ఇంజినీరింగ్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రతిభా పాటవాలతో తెలంగాణలో భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి భవిష్యత్తు తాగు, సాగునీటి అవసరాలను తీర్చిన దార్శనికుడని కొనియాడారు. ఉస్మాన్‌సాగర్, నిజాంసాగర్, హిమాయత్ సాగర్, డిండి, కోయిల్‌సాగర్, పోచంపాడు, లోయర్ మానేరు తదితర అనేక ప్రాజెక్టులను నిర్మించిన ఘనత ఆయన సొంతమని ప్రశంసించారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ, అప్జల్‌గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా దవాఖాన ఆయన కాలంలోనే రూపుదిద్దుకున్నాయని వివరించారు. ఆ మహనీయుడి సేవలను గుర్తించే కేసీఆర్ ఆయన జయంతి అయిన జూలై11ను ఏటా తెలంగాణ ఇంజినీర్స్ డేగా జరుపుకోవాలని నిర్ణయించి సముచితంగా గౌరవించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.