మహారాష్ట్ర బీజేపీ ఎంపీ సంజయ్ పాటిల్
ముంబై: తాను బీజేపీ నుంచి ఎంపీగా ఉన్నందున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన జోలికి రాదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ పాటిల్ అన్నారు. ఈడీని ఎగతాళి చేశారు. సంజయ్ మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నేను బీజేపీ ఎంపీని కాబట్టి ఈడీ నా జోలికి రాదు. బడాయి కోసం రూ.40 లక్షల కారు కొనేందుకు మేం లోన్ తీసుకోవాల్సి వస్తున్నది. మాకున్న రుణం చూస్తే ఈడీ ఆశ్చర్యపోతుంది’ అన్నారు. ఇటీవలే మరో బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బీజేపీలో ఉన్నవారిపై ఎలాంటి దర్యాప్తులు ఉండవని, హాయిగా కాలం వెళ్లదీయవచ్చని అన్నారు. హర్షవర్ధన్ పాటిల్ 2019లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తమ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నదని మహారాష్ట్రలోని అధికార మహా అఘాదీ కూటమి నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.