బెంగళూరు, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలోని ‘కమీషన్ రాజ్’తో కాంట్రాక్టర్లు హడలెత్తిపోతున్నారు. బీజేపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న కమీషన్ దందాపై బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. కమీషన్ కోసం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వేధింపులను తాళలేకపోతున్నామని కర్ణాటక స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సోమవారం సంచలన ఆరోపణలు చేసింది. ముడుపుల కోసం బీజేపీ ఎమ్మెల్యేలు సాగించిన వాట్సాప్ సంభాషణలు, ఆడియో టేపులను అసోసియేషన్ సభ్యులు మీడియాకు విడుదల చేశారు. కమీషన్ వ్యవహారంలో కనీసం 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు నలుగురు మంత్రులు ఉన్నట్టు పేర్కొన్నారు. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ మాట్లాడుతూ.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ద్వారా బీజేపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
తాను కూడా ఆ ఎమ్మెల్యేకు నేరుగానూ, ఇంజినీర్ల ద్వారానూ లంచాలు ఇచ్చినట్టు వెల్లడించారు. 2019 నుంచి కంతుల కింద ఆ ఎమ్మెల్యేకు ముడుపులు ఇస్తున్నట్టు తెలిపారు. దవాఖాన నిర్మాణ పనులకు 20 లక్షలు, పీడబ్ల్యూడీ పనులకు 12.5 లక్షలు, కొవిడ్ ఫస్ట్‌వేవ్ సమయంలో రూ.10 లక్షలు, సెకండ్ వేవ్ సమయంలో రూ.12 లక్షలు చెల్లించినట్టు వివరించారు. ఇదికాకుండా, చిత్రదుర్గలో రెసిడెన్షియల్ లేఔట్‌కు అనుమతి కోసం మరో రూ.22 లక్షలు ముడుపులు ఇచ్చినట్టు తెలిపారు. కొత్తగా కాంట్రాక్టులు ఇవ్వాలంటే రూ.30 లక్షలు కమీషన్ అడ్వాన్స్‌గా ఇవ్వాలని ఆ ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్టు ఆరోపించారు. ఇందుకు ఆయన కుమారుడే సాక్షి అని పేర్కొన్నారు.
రేపు నిరసన
బొమ్మై సర్కారు అవినీతి పాలనకు వ్యతిరేకంగా బుధవారం బెంగళూరులో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ వెల్లడించారు. ఇందులో సుమారు పాతిక వేల మంది కాంట్రాక్టర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు అధికార పార్టీ నేతలు 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టర్లు ముందు నుంచీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేధింపులు తాళలేక ఓ కాంట్రాక్టర్లు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలూ ఉన్నాయి.