
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి : తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం
ఖైరతాబాద్, నవంబర్ 10 : పంట కొనుగోలుపై గగ్గోలు పెడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ, మంత్రుల వైఖరిని ఎండగట్టారు. వరి ధాన్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు కొనుగోలు చేయకుండా రాష్ర్టాల మీద నిందలు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రధాన మంత్రి కాళ్లు మోక్కుతారా.. దండం పెడుతారా.. వరి కొనుగోలు చేసేలా చూడాలన్నారు. దళిత బంధుపై విమర్శలు గుప్పించే ఎంపీ బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం దగ్గరకు వెళ్లి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం లక్షన్నరకు పైగా ఉద్యోగాలిచ్చిందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారని, ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. రైతులకు మద్దతుగా ఈనెల 29న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు.
ఈటల గెలుపు బీజేపీ గెలుపెలా అవుతుంది..
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారని డబ్బా కొట్టుకొని తిరుగుతున్న బీజేపీ నాయకులు వారి గుండెపై చేయి వేసుకొని ఆలోచించాలని, ఈటల టీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక పర్యాయాలు గెలిచారని, ఆ గుర్తింపుతోనే ప్రజలు ఎన్నుకున్నారు తప్పా పార్టీని చూసి కాదన్నారు. అక్కడ ఆయన కాకుండా ఇంకెవరైనా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకపోయేదన్నారు. దుబ్బాకలో కూడా అదే జరిగిందన్నారు. సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి, ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సయ్య, మల్లేశ్, శ్రావణ్‌కుమార్, రమేశ్ పాల్గొన్నారు.