దళిత వ్యతిరేక పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ మరోసారి తన నిజ స్వరూపాన్ని చాటుకున్నది. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకానికి మోకాలడ్డింది. బీజేపీ చేసిన ఫిర్యాదుల మేరకు హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం అమలును నిలిపివేస్తూ ఎలక్షన్ కమిషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
బీజేపీ తీరు దళితుల నోటికాడ బువ్వ ఎత్తగొట్టినట్టుగా ఉన్నదని దళిత సంఘాల నేతలు, దళిత మేధావులు ధ్వజమెత్తారు. దళిత బంధు పథకాన్ని ఆపేయాల్సిందిగా బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈసీకి లేఖ రాసినట్టు ఇదివరకే వార్తలు వచ్చాయి. ఈటల ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నట్టు టీఆర్ఎస్ ముందు నుంచే ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చింది. అయితే తాను లేఖ రాయలేదంటూ ఈటల చెబుతూ వచ్చారు. ఆయన మాటలు పచ్చి అబద్ధాలని హుజూరాబాద్ దళితులకు ఆయన వెన్నుపోటు పొడిచారని తాజా పరిణామంతో స్పష్టమైంది.
నిజానికి దళిత సాధికారత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రారంభించింది. గత మార్చి 18న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే దీనికి నిధులను కేటాయించింది. అసెంబ్లీలో ఆమోదాన్ని కూడా పొందింది. ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్ కంటే ముందే ఆగస్టు 4నే వాసాలమర్రిలోనే ఈ పథకం అమలు ప్రారంభమైంది. తర్వాత ఆగస్టు 16న హుజూరాబాద్‌లోనూ, ఆ తర్వాత రాష్ర్టానికి నలువైపులా ఉన్న నాలుగు ఎస్సీ నియోజకవర్గాలోని నాలుగు మండలాల్లో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. దళిత సాధికారత పథకానికి అసెంబ్లీ ఆమోదం పొందేనాటికి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఊసే లేదు. హుజూరాబాద్‌లో పథకం అమలుకు 2 వేల కోట్ల నిధుల విడుదల ఆగస్టు 26 నాటికి పూర్తయ్యింది. అప్పటికి ఉప ఎన్నిక నోటిఫికేషన్ షెడ్యూలు కూడా వెలువడలేదు.
వాస్తవం ఇది కాగా, ఉప ఎన్నికల్లో ప్రయోజనం కోసమే, ఇప్పుడే హుజూరాబాద్‌లోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్టు బీజేపీ- ఈటల ఫిర్యాదు చేయడం, దాన్ని ఈసీ ఆమోదించి దళిత బంధును నిలిపివేయడం విడ్డూరంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాజ్యాంగ సంస్థ అయిన ఈసీ వాస్తవాలను పట్టించుకోకుండా రాజకీయ ఒత్తిడికి లోబడి తన పరిధులు అతిక్రమించినట్టుగా కనిపిస్తున్నదని వారు విశ్లేషించారు. బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని వారు పేర్కొన్నారు. కమలనాథుల దళిత వ్యతిరేక రాజకీయాలకు ఇది పరాకాష్ట అని వారు అభివర్ణించారు.
హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు తథ్యమని, తమ ఓటమి ఖాయమని అర్థం కావడంతోనే బీజేపీ అగ్రనేతలు రాజ్యాంగ సంస్థలను అడ్డుపెట్టుకొని కుట్ర రాజకీయాలకు తెర తీశారని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అనుకున్నంత పని చేశారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని నిలిపివేసేలా కుతంత్రం పన్ని, మోకాలడ్డారు. ఈటల, బీజేపీ కలిసి చేసిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం దళిత బంధును నిలిపివేయాలని ఆదేశించింది. ఈ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారులకు డబ్బులు చేరుతాయి. కాబట్టి హుజూరాబాద్‌లో ఉపఎన్నిక పూర్తయ్యేంత వరకు దళితబంధు అమలును నిలిపివేయాలని సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఇప్పటివరకు దళితుల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన ఈ పథకానికి ఈటల రూపంలో బ్రేక్ పడింది. వాస్తవానికి దళితబంధు విషయంలో ఈటల వ్యవహార శైలిపై టీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతకాలంగా అనుమానాలున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఆయన కుట్రలుపన్నారు. పట్టుబట్టి దళితబంధును నిలిపివేయించారు. ఈ పథకంపై ఈటల మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు. ఉన్నోళ్లకు వంతపాడే ఆయన.. దళితుల అభివృద్ధిని ఓర్చుకోలేకపోయారు. అందులోనూ ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు వస్తుంటే తన ఆధిపత్యానికి ఎక్కడ గండి పడుతుందోనని ఆందోళనకు గురయ్యారు. దళితబంధు విజయవంతమైతే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని భావించి.. దీనిని అడ్డుకొనేందుకు కుటిల యత్నాలు చేస్తూనే ఉన్నారు. చివరకు దళితులకు అన్యాయం చేశారు. బడుగు, బలహీనవర్గాలపై తన వ్యతిరేకబుద్ధిని మరోసారి బయటపెట్టుకొన్నారు.
అప్పుడు చేయ చేతకాలె.. ఇప్పుడు అడ్డుకుంటుండు
18 ఏండ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఈటలకు పట్టం కట్టారు. కానీ, ఆయన ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి చేసిందేమీ లేదు. అప్పుడు అభివృద్ధి చేయడం చేతకాని ఈటల.. ఇప్పుడు ఆ ప్రాంత దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకాన్ని నిలిపివేయించారు. ఇదేనా ప్రజలపై ఆయనకున్న ప్రేమ? ఇదేనా దళితుల అభివృద్ధిపై ఉన్న తపన? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. దళితబంధును నిలిపివేయాలంటూ గతంలో ఈటల రాసిన ఒక లేఖ బయటకొచ్చింది. ఆ లేఖను తాను రాయలేదని అప్పట్లో ఆయన బుకాయించారు. మరి ఇప్పుడేమంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆయన రాసిన లేఖ కారణంగానే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఇప్పుడేమి సమాధానం చెప్తారని నిలదీస్తున్నారు.
భగ్గుమంటున్న దళిత సమాజం
ఈటల రాజేందర్, బీజేపీ కారణంగా దళితబంధు పథకం నిలిచిపోవడంతో దళితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఈటల కుట్రలపై భగ్గుమంటున్నారు. ‘నీకు ఎలాగూ మమ్మల్ని బాగు చేయడం చేతకాదు.. కనీసం మాకు సాయం చేస్తున్న వారిని కూడా చేయనివ్వరా..?’ అని ప్రశ్నిస్తున్నారు. తమ నోటికాడి ముద్దను లాగేసారని, ‘ఈటల దళితద్రోహి’ అని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దళితబంధు నిలిపివేసినందుకు ఈటల తగిన మూల్యం చెల్లించకతప్పదని దళిత సమాజం హెచ్చరిస్తున్నది.
మీదికి ప్రేమ.. లోపలంతా విషమే..
ఈటల రాజేందర్‌కు బడుగు, బలహీన వర్గాలపై మీదికి మాత్రమే ప్రేమ, లోపలంతా విషమే ఉంటుంది. దీనికి దళితబంధును ఆపాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడమే నిదర్శనం. సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టడంతో ఈటలకు కడుపు నొప్పి మొదలైంది. ఎలాగైనా ఆపాలని కుట్రలు పన్నిండు. ఈటల ఖబడ్దార్.. ఇప్పటికైనా నీ వెకిలి చేష్టలు మానుకోకపోతే నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారు. నీ ఓటమి తథ్యం. ఈ ఎన్నికలతో నీ రాజకీయ జీవితం సమాధి కావడం ఖాయం. దళితులతో పెట్టుకోవడం మంచిది కాదు. కేసీఆర్ దేవుడు. పది లక్షలు ఇస్తానన్న కేసీఆర్‌కు దళితులు వెన్నంటి ఉంటారు. టీఆర్ఎస్ అభ్యర్థికి దళితులందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తరు. -ఇల్లందుల శ్రీనివాస్, జూపాక, హుజూరాబాద్ మండలం
బీజేపీకి దళితుల సత్తా చూపుతాం
సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెడితే బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ఎన్నికల ముందే ప్రవేశపెట్టిన పథకాన్ని ఎట్ల ఆపివేస్తారు. కోడ్ రాకముందే మా అకౌంట్లో డబ్బులు జమయ్యాయి. బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ దళితులపైన కుట్ర చేస్తున్నారు. దళితలంతా ఏకమవుతాం. మా వాడలకు వస్తే తరిమికొడుతాం. -గుల్లి కుమార్, అంబేద్కర్ కాలనీ, జమ్మికుంట
నువ్వు ఓడాలే.. కేసీఆర్ గెలవాలే
నీ బుద్ధి పోనిచ్చుకోవా ఈటలా.. మే కష్టాల్లో ఉన్నం. మా కష్టాలను చూసి కేసీఆర్ దళిత బంధు ఇస్తుంటే నువ్వు ఎందుకు ఆపినట్టు. దళితులకు దళితబంధును ఎందుకు రానిస్తలేవు. రేపు ఏం మొఖం పెట్టుకొని మా దళిత వాడల్లో ఓట్లు అడగడానికి వస్తావు. నిన్ను ఓడిస్తం. నువ్వు ఓడాలే. కేసీఆర్ గెలవాలే.
– హుజూరాబాద్ మహిళలు
ఖబడ్దార్ ఈటల
మా పిల్లలు, మేం గోలుగోలుమనుకుంటా ఉంటే అంబేద్కర్ బాటలో కేసీఆర్ మాకు దళిత బంధు ఇచ్చిండు. మీరు వెన్నుపోటు పొడిచిర్రు. మా నోటికాడి బుక్క లాక్కున్నరు. దళితబంధును అడ్డుకున్నరు. ఖబడ్దార్ ఈటల గారు… మీరు గెలవకుండా జమ్మికుంట ప్రజలం మేం గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నం.
– జమ్మికుంట ప్రజలు
నేను దళిత బంధు వద్దని ఉత్తరం రాసినట్టుగా ఒక దొంగ ఉత్తరాన్ని సృష్టించిండు కేసీఆర్. ఈటల రాజేందర్ దళిత ద్రోహి అని చెప్పడానికే ఈ ఉత్తరం సృష్టించి పంచుతున్నరు.
పలు సభల్లో ఈటల రాజేందర్
అబద్ధాల ఈటలా మరి ఇప్పుడేమంటావ్