హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బీసీల ఝూటా పార్టీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఎద్దేవా చేశారు. జాతీయ కులగణన సర్వే మొదటి విడతలో బీసీ కులాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ వద్ద గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీసీలకు సంబంధించి 10 అంశాలపై సమాధానమివ్వాలని కోరినా, ప్రధాని మోదీ స్పందించలేదని తెలిపారు. బీసీ కులగణన చేయకుండా రాష్ట్రంలో బీజేపీ ఇంకో వందేళ్లు అ యినా అధికారంలోకి రాదని తేల్చిచెప్పారు. బీసీల కులగణన విషయంలో బీసీలను ప్రధాని మరోసారి మోసం చేశారని మండిపడ్డారు. త్వరలో పరేడ్ గ్రౌండ్లో బీసీ మహాగర్జన నిర్వహించి బీసీల సత్తాను చూపిస్తామని పేర్కొన్నారు. 12ఏండ్ల పాలనలో బీసీలకు బీజేపీ ఒరగబెట్టింది ఏముందని ప్రశ్నించారు. మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించకుండా అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.