నర్సింహులపేట, మే 13: అభివృద్ధి పేరుతో ఇసుక అక్రమ వేలం పాటలను అరికట్టాలని పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ హెచ్చరించినా దందా మాత్రం ఆగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని జయపురం, కౌసల్యదేవిపల్లి, బక్కతండా జీపీ పరిధిలోని ఆకేరువాగు నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు టాక్స్ పేరుతో బహిరంగ వేలం వేశారని, అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు అందినకాడికి దోచుకుంటున్నట్టు పేర్కొంటున్నారు.
జయపురం ఏడాదికి రూ.10 లక్షలు , బక్కతండా నాలుగు నెలలకు రూ.5 లక్షలు , కౌసల్యదేవిపల్లి రెండు నెలలకు రూ.1,20,000 వేలం వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినా వాటాలు ముట్టడంతో పట్టించుకోవడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇసుక తరలింపునకు ఎలాంటి వేలం వేయొద్దనే నిబంధనలు ఉన్నా అధికారులు మిన్నకుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకొచ్చింది. దీంతో ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇసుక తరలిస్తున్నారు.
ఒకటి, రెండు రోజుల పాటు టాక్స్ వసూళ్లు నిలిపివేసిన ప్రైవేట్ వ్యక్తులు మళ్లీ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ట్రాక్టర్ల యజమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ రమేశ్‌బాబు మాట్లాడుతూ.. వేలం వేసిన విషయం తెలియడంతో పన్నులు వసూలు చేయొద్దని జయపురంలో తెలిపామని చెప్పారు. ఇసుక వేలం వేయడం నేరమని, బలవంతపు పన్నులు వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.