జోగులాంబ గద్వాల : భారత రాజ్యాంగం ( Constitution ) పై బీజేపీ నమ్మకం లేదని అందుకనే రాజ్యాంగం అమలులో నిర్లక్ష్యం చేస్తుందని మాజీ ఎంపీ సుభాషిణి ఆలీ ( Former MP Subhashini Ali ) ఆరోపించారు. ఆవాజ్ ( Awaaz ) రాష్ట్ర 3 వ మహాసభల సందర్బంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని మక్కా మసీదు నుంచి పట్టణ పుర విధులలో ర్యాలీ నిర్వహించి, తేరు మైదానంలో బహిరంగ సభను నిర్వహించారు. ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికూర్ రెహమాన్ సభాద్యక్షతన నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు.
రాజ్యాంగం స్థానంలో బీజేపీ మనుస్మృతి అమలులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. సీఏఏ ( CAA ) ,ఎన్ఆర్సీ ( NRC ) చట్టం వల్ల మైనార్టీ హక్కులకు భంగం కలిగిందని అన్నారు. పరదచాటున ఉన్న మైనార్టీ మహిళలు తమ హక్కుల కోసం రోడ్ల పైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారని పేర్కొన్నారు. మైనారిటీ ల దేశభక్తిని ఎవరూ గుర్తించవలసిన అవసరం లేదని తెలిపారు. తాము భారతదేశ పౌరులమని అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా తమకు సర్వ హక్కులు కల్పించారని అన్నారు.
స్వశక్తి తో అన్ని రంగాలలో మహిళలు ముందుకు వెళుతుంటే బీజేపీ మాత్రం మహిళ హక్కులను నిరాకరిస్తున్నదని విమర్శించారు. భేటీ పడావో.. భేటీ బచావో అంటూ నినాదాలు ఇస్తున్న బీజేపీ అధికారంలో ఉన్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఆడ పిలల్లపై జరుగుతున్న అరాచకాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇన్చార్జి సరితమ్మ , గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ జబ్బార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, జేఏసీ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షుడు తాహేర్, పాలమూరు అధ్యయన వేదిక ఇక్బాల్ పాషా, పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు సుభాన్, వివిధ సామాజిక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.