చండీగఢ్, ఫిబ్రవరి 14: ప్రత్యర్థి పార్టీల ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తున్నది. విపక్షాల సీనియర్ నేతల హెలికాప్టర్ ప్రయాణాలకు అనుమతి నిరాకరిస్తున్నది. ఇటీవలే ఎగరడానికి అనుమతి ఇవ్వకుండా గంటల పాటు ఎదరుచూసేలా చేసిన కేంద్రం.. తాజాగా పంజాబ్ సీఎం చన్నీని కూడా అదే విధంగా ఇబ్బంది పెట్టింది. ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో ఉన్నారని, భద్రతా కారణాల దృష్ట్యా చన్నీ హెలికాప్టర్ ఎగరడానికి అనుమతులు ఇవ్వలేమని అధికారులు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రచారానికి హాజరు కావాల్సి ఉన్న చన్నీ చేసేది లేక ఇంటికి వెళ్లిపోయారు.
4 గంటలకు పైగా ఎదురుచూపులు
సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హోషియార్‌పూర్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. దీనికి చన్నీ హాజరు కావాల్సి ఉంది. ఆయన చండీగఢ్‌లోని రాజేంద్ర పార్క్ నుంచి హెలికాప్టర్లో హోషియార్పూర్ వెళ్లాలి. అయితే, ఆ ప్రాంతాన్ని అధికారులు సడెన్‌గా ‘నో ఫ్లయింగ్ జోన్’ అని ప్రకటించారు. ప్రధాని మోదీ జలంధర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, హెలికాప్టర్ ఎగరడానికి అనుమతి ఇవ్వలేమని పేర్కొన్నారు. అనుమతి కోసం చన్నీ నాలుగు గంటలకు పైగా ఎదురుచూసి వెనుదిరిగారు. రాహుల్ ర్యాలీకి హాజరు కాలేదు.
ఇది పద్ధతి కాదు
తన హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై చన్నీ తీవ్రంగా స్పందించారు. ‘నేనేమీ ఉగ్రవాదిని కాదు’ అని వ్యాఖ్యానించారు. ‘చన్నీ ముఖ్యమంత్రి. టెర్రరిస్టు కాదు. ఇది పద్ధతి కాదు’ అని తీవ్ర స్వరంతో అన్నారు. చన్నీ హెలికాప్టర్ ఎగరడానికి అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేత సునీల్ జఖర్ మాట్లాడారు. ‘ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఈ ఎన్నికలు డ్రామాగా భావించాల్సి వస్తుందన్నారు.
వాళ్ల యువరాజు కోసం నన్నూ ఆపేశారు
జనవరిలో ప్రధాని మోదీని రైతులు రోడ్డుపై అడ్డగించిన తర్వాత ఆయన పంజాబ్‌లో తొలిసారిగా సోమవారమే పర్యటించారు. చన్నీ హెలికాప్టర్‌కు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన మాట్లాడారు. 2014లో తనకు కూడా అప్పటి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది అన్నారు. ‘2014లో నేను పఠాన్‌కోట్, హిమాచల్‌లో ప్రచారానికి వెళ్లాల్సి ఉంది. కానీ వాళ్ల యువరాజు(రాహుల్ గాంధీ) అమృత్‌సర్‌లో ఉన్నారని నా హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదు’ అని మోదీ అన్నారు. ప్రతిపక్షాలను పనిచేయకుండా అడ్డుకోవడం కాంగ్రెస్‌కు అలవాటని వ్యాఖ్యానించారు.