e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home News కేసీఆర్‌ సభపై కుట్ర

కేసీఆర్‌ సభపై కుట్ర

  • ఈసీ ఆంక్షల ముసుగులో అడ్డుకొనేందుకు బీజేపీ యత్నం
  • హుజూరాబాద్‌ పొరుగునా సభలు వద్దు.. ఈసీ ‘ఉచిత సలహా’
  • కొవిడ్‌ మహమ్మారి పేరుతో విచిత్ర సర్క్యులర్లు
  • బీజేపీ సభకు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?
  • ఓటమి ఖాయమవడంతో కమలనాథుల బెంబేలు
  • పరువు దక్కించుకునేందుకు రోజుకో కొత్త పన్నాగం
  • ఒత్తిడితోనే ఈసీ సలహాలన్న రాజకీయ పరిశీలకులు
  • పశ్చిమ బెంగాల్‌లో ఇలాగే చేసి బీజేపీ బొక్కబోర్లా
  • హుజూరాబాద్‌లోనూ కాషాయ దళానికి ఇదే గతి!

ఇది పెంచికల్‌పేట. కరీంనగర్‌ జిల్లాతో గానీ, హుజూరాబాద్‌ నియోజకవర్గంతో గానీ ఈ ఊరుకు ఏ సంబంధమూ లేదు. కేవలం ఆ నియోజకవర్గానికి పక్కన ఉంటుందంతే. ఇక్కడ 27న కేసీఆర్‌ సభ నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ భావించింది. అయితే కొవిడ్‌ నిబంధనల పేరు చెబుతూ, హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సమీపంలో కూడా సభలు నిర్వహించవద్దని ఎలక్షన్‌ కమిషన్‌ గురువారం ‘సలహా’ పేరిట ఒక సర్క్యులర్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్‌ పోలింగ్‌కు ముందే బీజేపీ బెంబేలెత్తిపోతున్నది. ఓటమి ఖాయమని తెలిసి వణికిపోతున్నది. పోయే పరువు ఎలా దక్కించుకోవాలో తెలియక రోజుకో కొత్త పన్నాగానికి తెర తీస్తున్నది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డం పెట్టుకొని కుట్రలు, కుహకాలకు పాల్పడుతున్నది. నిన్నటికి నిన్న డొంకతిరుగుడు ఫిర్యాదు చేసి దళితబంధును ఆపించిన బీజేపీ నేతలు తాజాగా ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్‌ సమీప జిల్లాల్లో సైతం ఎలాంటి బహిరంగ సభలు పెట్టుకోరాదంటూ.. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం చేత ఓ ఉచిత సలహా (అడ్వైజరీ) ఇప్పించారు. ఈ సలహా.. ఈ నెల 27న వరంగల్‌ జిల్లా పెంచికల్‌పేట (హుస్నాబాద్‌ నియోజకవర్గం)లో తలపెట్టిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సభను అడ్డుకోవడం కోసమేనని చెప్పకనే చెప్పినట్టయింది.

- Advertisement -

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల అయింది సెప్టెంబర్‌ 28న. షెడ్యూలును వెలువరించినప్పుడే నియమ నిబంధనలను ఈసీ విస్పష్టంగా ప్రకటించింది. ఉప ఎన్నిక జరుగుతున్న నియోజకవర్గం ఉన్న జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని వెల్లడించింది. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో సభలు, సమావేశాలు ఏ మేరకు నిర్వహించాలో.. ప్రచారం ఏ పద్ధతిన, ఎంతమందితో చేయాలో కూడా సంఖ్యతో సహా స్పష్టంగానే చెప్పింది. అన్ని సందర్భాల్లోనూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలంటూ అధికారులకు, రాజకీయ పార్టీలకు నిర్దేశించింది. ఆ సమయంలో నియోజకవర్గానికి పొరుగు జిల్లాల్లో సభలు, సమావేశాల గురించి ఈసీ మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు.

నోటిఫికేషన్‌ వచ్చిన రెండు రోజులకు అంటే అక్టోబర్‌ మూడున హుజూరాబాద్‌ నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న హుస్నాబాద్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అప్పటిదాకా చేసిన పాదయాత్రకు ముగింపు పలికారు. ఆ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కూడా పాల్గొన్నారు. అప్పుడు ఇలాంటి అడ్వైజరీలు ఏవీ ఎన్నికల సంఘం నుంచి వెలువడనే లేదు. కొవిడ్‌ అడ్డు రానేలేదు.. అదే హుస్నాబాద్‌ నియోజకవర్గంలో సరిగ్గా ముఖ్యమంత్రి సభ పెట్టాలని అనుకొని.. ఏర్పాట్లన్నీ పూర్తవుతున్న తరుణంలోనే హఠాత్తుగా ఎన్నికల సంఘం నుంచి ఇలాంటి అడ్వైజరీ వచ్చిందంటే.. దాని వెనుక ఎవరి హస్తం ఉన్నదో స్పష్టంగానే తెలుస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

సభపై బీజేపీ బెంబేలు
సీఎం కేసీఆర్‌ సభ నిర్వహిస్తున్నారని తెలియగానే బీజేపీ ఉలిక్కిపడింది. సీఎం ఎక్కడ బహిరంగ సభ పెట్టినా.. కొద్దో గొప్పో తమకు రాలుతాయనుకొంటున్న ఓట్లు రాలకుండా పోతాయని, పరువు కూడా పోతుందని కమలనాథులు ఆగమాగమవుతున్నా రు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘంచేత ఇలాంటి అడ్వైజరీలు ఇప్పించారని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. ఇది కచ్చితంగా రాజకీయ ఒత్తిడితో ఇచ్చిన ఆదేశాలేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హుజూరాబాద్‌లో ప్రజలనుంచి వస్తున్న స్పందన చూస్తుంటే టీఆర్‌ఎస్‌ గెలుపు.. తమ ఓటమి ఖాయమైందని బీజేపీకి అర్థమైంది. సీఎం కేసీఆర్‌ సభకు ఎల్కతుర్తి మండలంలో ఏర్పాట్లు సైతం తుదిదశకు చేరుకున్నాయి. వాస్తవానికి హుజూరాబాద్‌ నియోజకవర్గానికి, సభ నిర్వహించే ప్రాంతానికి సంబంధంలేదు. అయినప్పటికీ సభను అడ్డుకోకపోతే తమ ఉనికే ఆగమవుతుందన్న భయంతో బీజేపీ ఈసీ చేత ఈ సలహా ఇప్పించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదేం నిబంధన?
ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగితే జిల్లా వరకు మాత్రమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది. ఆ నియోజకవర్గం రాజధానిలో లేదా మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉంటే కోడ్‌ ఆ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతుంది. షెడ్యూలు ప్రకటించినప్పుడు జిల్లా వరకు ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఈసీ స్పష్టమైన ప్రకటన చేసింది. గురువారం రాజకీయ పార్టీలకు ఇచ్చిన ఉచిత సలహా (అడ్వైజరీ)తో పాటు.. అధికారులకు విడుదల చేసిన మరో సర్క్యులర్‌లో ఇవే ఆదేశాలను పునరుద్ఘాటించింది. అలాంటప్పుడు ఈ అడ్వైజరీ ఇప్పించడం వెనుక మతలబు ఏమిటని టీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.

బెంగాల్‌లోనూ ఇలాగే..
ఎన్నికలు ఎక్కడ జరిగినా.. తనకు అనుకూలంగా కేంద్ర ఎన్నికల సం ఘంద్వారా పనిచేయించుకోవడం, తద్వారా రాజకీయ లబ్ధికి ప్రయత్నించడం మామూలైపోయిందన్న విమర్శలు ఉన్నాయి. మొన్నటికి మొన్న పశ్చిమబెంగాల్‌లో ఇదే రకంగా పనిచేయించి బొక్కబోర్లా పడింది. బెం గాల్‌, తమిళనాడు రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించిన ఈసీ.. శాంతిభద్రతల పేరు చెప్పి 294 స్థానాలున్న పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలను ఏకంగా ఎనిమిది దశల్లో నిర్వహించింది. ఎంత చేసినప్పటికీ బెంగాల్‌లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. తమిళనాడులో ఎలాగూ తనకు అస్తిత్వం లేదు కాబట్టి ఒకే దశలో ఎన్నికలు నిర్వహించినా బీజేపీ పట్టించుకోలేదు. తాను చెప్పినట్టల్లా నడిచేలా స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ వ్యవస్థలను అడ్డగోలుగా వాడుకోవడం బీజేపీకి మాత్రమే చెల్లిందని పలువురు విమర్శిస్తున్నారు.

వాళ్లకో న్యాయం..


ఇది హుస్నాబాద్‌. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి ఆనుకునే ఉంటుంది. ఇక్కడ అక్టోబర్‌ 3న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు పేరుతో సభ నిర్వహించారు. ఏకంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీకి చెందిన ఇతర ముఖ్యనేతలంతా ఈ సభకు హాజరయ్యారు. హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ (అక్టోబర్‌ 1) జారీ తర్వాతే బీజేపీ ఈ సభను పెట్టినా ఎన్నికల సంఘం అప్పుడేమీ మాట్లాడలేదు. కొవిడ్‌ నిబంధనల అమలు అప్పుడెవరికీ గుర్తు రాలేదు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement