దిస్పూర్, మార్చి 19: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో రాజకీయ సందడి ప్రారంభమైంది. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీకి ఏప్రిల్ 9న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో వరుసగా మూడోసారి అధికారం లోకి రావాలని బీజేపీ ఆరాటపడుతున్నది. హిందూ కార్డు తమకు అధికారం కట్టబెడుతుందని ఆ పార్టీ భావిస్తున్నది. ఇక గౌరవ్ గొగొయ్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎలాగైనా అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఏఐయూడీఎఫ్, రజ్జొర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్, అస్సాం గణ పరిషత్ లాంటి ప్రాంతీయ, మైనారిటీ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. 2021 ఎన్నికల్లో అధికార బీజేపీ 60 సీట్లు, కాంగ్రెస్ 29, ఏఐయూడీఎఫ్ 16, ఏజీపీ 9 సీట్లు గెల్చుకున్నాయి. మొత్తం ఎన్డీఏ కూటమి 75 సీట్లు గెల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో అస్సాం గణపరిషత్, బోడోలాండ్ ఫ్రంట్ ఉండగా, కాంగ్రెస్ పక్షాన అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎం), ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్ (ఏపీహెచ్ఎల్సీ) లాంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.
ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆధ్వర్యంలో అధికారులు మాత్రం ఎడాపెడా సంక్షేమ పథకాలను ప్రకటించారు. తమ పాలనపై ప్రజల్లో అసంతృప్తిని గ్రహించిన శర్మ ఈ నెల 12న ఖానాపారాలో జరిగిన ఒక కార్యక్రమంలో 40 లక్షల కుటుంబాలకు చెందిన మహిళలకు ఒక్కొక్కరికీ రూ. 9,000 చొప్పున నగదు బదిలీ చేయడంతో పాటు 6,500 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మరో 65 వేల ఉద్యోగాలు రానున్నాయని సీఎం ప్రకటించారు.
దశాబ్దం పాటు రాష్ర్టాన్ని ఏలిన బీజేపీకి మూడోసారీ పట్టం కడతారా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. పదేండ్ల కాలంలో తాము చేసిన అభివృద్ధి గురించి బీజేపీ తరచూ ప్రచారం చేస్తున్నది. అయితే వాస్తవ పరిస్థితులు ఆ పార్టీ ఆశించినట్టుగా లేవు. పరిశ్రమలు లేకపోవడం, ఉద్యోగ అవకాశాలు మృగ్యం కావడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సీఎం శర్మపై, ఆయన కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు ప్రతికూలంగా మారొచ్చు.
ఒకప్పుడు అస్సాంలో రాజకీయ ఆధిపత్య శక్తిగా ఉన్న కాంగ్రెస్ 2016లో అధికారం కోల్పోయి దశాబ్దం గడిచినా ఇంకా కోలుకోలేదు. ఆ పార్టీ ఇంకా అస్థిత్వం కోసం పోరాటం సాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ఆ పార్టీ ఉనికి క్షేత్ర స్థాయిలో మందకొడిగా కన్పిస్తున్నది. కొత్త అభ్యర్థుల మిశ్రమంతో పార్టీ స్థానాన్ని పునః స్థాపించుకోవడానికి ప్రయత్నిస్తునప్పటికీ క్షేత్ర స్థాయిలో అనుకున్నంత అనుకూలత కన్పించడం లేదు.