(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పటికే చమురు, గ్యాస్ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేశాయి. ఇప్పుడు ఈ ఘర్షణలు ప్రపంచ ఇంటర్నెట్ సదుపాయాలను స్తంభింపచేయవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. హొర్ముజ్ జలసంధిని ఇరాన్, ఎర్ర సముద్రం దక్షిణ ముఖద్వారంలో ఉండే బాబ్ అల్ మందేబ్ జలసంధిని ఇరాన్‌కు మద్దతు ఇస్తున్న హౌతీలు టార్గెట్ చేసి అండర్‌సీ ఫైబర్ కేబుల్స్‌ను నాశనం చేయవచ్చని అనుమానిస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ షట్‌డౌన్ అయ్యే ప్రమాదం ఉన్నదని అంటున్నారు.
ఐరోపా, ఆసియా, ఆఫ్రికా, పర్షియన్ గల్ఫ్‌తో పాటు భారత్‌లోని విదేశీ డాటా కనెక్షన్లకు, ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు అత్యంత కీలకమైన 20 అండర్‌సీ ఫైబర్ కేబుల్స్ ఎర్ర సముద్రం, హొర్ముజ్ గుండానే పోతున్నాయి. ఇప్పటికే, హొర్ముజ్‌లో సీమైన్స్‌ను ఇరాన్ మోహరించింది. ఎర్ర సముద్రంలో యాంకర్లు, సబ్మెరైన్లు, మందుగుండును హౌతీలు మోహరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫైబర్ కేబుల్స్‌పై దాడులు జరుగవచ్చని అనుమానాలు పెరుగుతున్నాయి.
ఈమెయిల్స్, వీడియో కాల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సర్వీసులు ఇలా ఏమీ పనిచేయవు. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌కు అంతరాయం ఏర్పడుతుంది. రోజూవారీగా జరిగే బిలియన్ డాలర్ల అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సందేశాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచమే స్తంభించిపోయే పరిస్థితి తలెత్తవచ్చు.
హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా 2024లో ఎర్ర సముద్రంలోని పలు కేబుళ్లపై హౌతీలు దాడులు చేశారు. దీంతో ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్ వేగం నెమ్మదించింది. వాటిని సరిచేయడానికి నెలల సమయం పట్టింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఎదురైతే, దెబ్బతిన్న కేబుల్స్‌ను సరిచేయడానికి కనీసం సంవత్సర కాలం పట్టొచ్చని నిపుణులు అంటున్నారు. అలా జరిగితే తమ పరిస్థితి ఏమిటని అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు తీవ్ర భయాందోళనలో ఉన్నాయి.