దుబాయ్: కొద్దిరోజుల క్రితం ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్, కెనడా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని వచ్చిన వార్తలు కలకలం రేపగా తాజాగా ఇందులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కెనడా కేంద్రంగా పనిచేసే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం కూడా ఇందులో ఉన్నట్టు కెనడియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (సీబీసీ) ఆరోపించింది. కెనడా జట్టుకు సారథిగా దిల్‌ప్రీత్ బజ్వాను నియమించడం దగ్గర్నుంచి జట్టులో ఎవరెవర్ని ఆడించాలి? బెంచ్‌పై ఎవరుండాలి? అన్న విషయాలపై బిష్ణోయ్ గ్యాంగ్ సెలక్టర్లను బెదిరింపులకు పాల్పడ్డట్టు సీబీసీ నివేదికలో పేర్కొంది. బజ్వాకు మద్దతు ఇవ్వకుంటే సదరు ఆటగాళ్ల కుటుంబాలను ఖతం చేస్తామని బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరించినట్టు తెలిపింది. కాగా, ఫిక్సింగ్ కుంభకోణంలో కెనడా క్రికెట్ అధ్యక్షుడు అర్విందర్ ఖోసా పాత్ర ఉన్నట్టు సీబీసీ ఆరోపించింది.