హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుకు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాలి గాయంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్న కేటీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, కార్యకర్తలతో పాటు పలువురు సెలబ్రిటీలు, రాష్ట్ర మంత్రులు, ఏపీకి చెందిన నాయకులు, ఇతర రాష్ర్టాలు, వివిధ దేశాలకు చెందిన ఆయన సన్నిహితులు ఆకాంక్షించారు. తెలంగాణ ప్రగతి కోసం పరితపించే నిరంతర శ్రామికుడు.. ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన లీడర్.. నవశకానికి దిక్సూచి.. యూత్ ఐకాన్.. డైనమిక్ లీడర్.. తండ్రికి తగ్గ తనయుడు, పేదలకు ఆపన్న హస్తం అందించే మనసున్న నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పలువురు నెటిజన్లు, ప్రముఖులు ట్వీట్లు చేశారు.
సినిమా హీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జున, మహేశ్‌బాబు, రాంచరణ్, రవితేజ, సుధీర్‌బాబు, సోనూసూద్, డైరెక్టర్లు హరీశ్‌శంకర్, బాబీ, మలినేని గోపీచంద్, మెహర్ రమేశ్, సినీతారలు మంచులక్ష్మి, ఈషా రెబ్బ, అనసూయ భరద్వాజ్, బండ్ల గణేశ్, సినీ గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి, జమ్ము-కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, విప్ బాల్క సుమన్, ఏపీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజా, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఏపీ నాయకులు గంటా శ్రీనివాసరావు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్, భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ ఫారెల్, ఏఐ ఇన్స్టిట్యూట్ సీఈవో, మాజీ ఆస్ట్రేలియన్ సెనెటర్ సిసాసింగ్, టెక్ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ, పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖ జర్నలిస్టులు కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్ రిప్లయ్ ఇచ్చారు.
డీజే టిల్లు చూడండి
కాలి గాయం కారణంగా తనను మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, వోటీటీలో అలరించే వెబ్‌సిరీస్‌లు ఉంటే చెప్పాలని మంత్రి కేటీఆర్ శనివారం ట్వీట్ చేసిన నేపథ్యంలో నెటిజన్లు కొన్ని పేర్లను సూచించారు. ప్రముఖ తెలుగు వోటీటీ ‘ఆహా’ కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. డీజే టిల్లు సినిమా చూడాలని, బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్బీకే అన్‌స్టాపబుల్, కుడి ఎడమైతే, భామాకలాపం మిస్సవ్వద్దని సూచించింది. జీ5 కూడా కేటీఆర్‌కు కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లను సూచించింది. ‘కేటీఆర్ గారూ గుడ్ మార్నింగ్.. మా నీళ్ల ట్యాంక్‌తో స్టార్ట్ చేసి, రెక్కితో థ్రిల్ అవుతూ, లంచ్ టైమ్‌కి ఫ్యామిలీ మొత్తం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ కంప్లీట్ చేసి, రాత్రికి ఆర్ఆర్ఆర్ చూసేయండి. త్వరగా రికవరీ అవుతారు. కానీ, ఒక్క విషయంలో జాగ్రత్త.. చూస్తూనే ఉండిపోతారు. కేటీఆర్ త్వరగా కోలుకోవాలి’ అని ట్వీట్ చేసింది. నెటిజన్లు చాలామంది కేటీఆర్‌ను పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చూడాలని సూచిస్తూ ట్వీట్లు చేశారు.