వరి సాగు ఒక్కటే పరిష్కారం కాదు. వరి పండిస్తే రైతులకు పెద్దగా లాభం లేదు. కాబట్టి రైతులు వేరే పంటలు చూసుకోవాలి.
– మార్చి 18న అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి
వరి సాగు చేయొద్దు. ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలి. కూరగాయలు పండించుకుంటే మంచిది.
– జూన్ 3న ఖమ్మంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
వరి వద్దు సరే.. మరి రైతులు ఏ పంట వేసుకోవాలె?
హైదరాబాద్, జూన్ 4(నమస్తే తెలంగాణ) : పంటల సాగు, కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు రైతులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నది. పంటలు కొనడం చేతగాక చేతులెత్తేసిన సర్కార్.. ఈ వైఫల్యాన్ని రైతులపైకే నెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నది. వరి సాగుచేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలకు మారాలంటూ పిలుపునిస్తున్న సర్కార్ పెద్దలు.. వరికి బదులు ఏ పంట వేయాలో సూటిగా చెప్పడం లేదు. ఇప్పటికే పలుచోట్ల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసిన రైతుల పంటలు కొనుగోలు చేయకుండా ప్రభుత్వ ప్రత్యక్ష నరకం చూపిస్తున్నది. ఆ రైతులకు చివరికి నష్టాలే మిగులుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలోని రైతులందరూ వరి కాకుండా మరే ఇతర పంట వేసినా పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పంటల సాగు, కొనుగోళ్లపై సరైన ప్రణాళిక లేకపోవడమే రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా వడ్ల కొనుగోలు నుంచి తప్పించుకొనే దురాలోచనే తప్ప, రేవంత్ సర్కార్కు శాస్త్రీయ విధానమంటూ ఏదీ లేదని వ్యవసాయరంగ నిపుణులు విమర్శిస్తున్నారు.
సందర్భమేదైనా సర్కార్ ఏడాది నుంచే ‘వరి’ పాటే పాడుతున్నది. వరి వద్దు.. ప్రత్యామ్నాయం ముద్దు అంటూ అటు సీఎం రేవంత్రెడ్డి.. ఇటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పదే పదే పిలుపునిస్తున్నారు. సభ ఏదైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా, అసెంబ్లీలోనూ, మీడియా చిట్చాట్లోనూ.. ఇలా ఎక్కడైనా వీరిద్దరు ప్రకటనలిస్తున్నారు. ‘కష్టం తక్కువ ఉంటుందని రైతులు వరి పండిస్తున్నరు. కానీ కేంద్రం కొనుగోలు చేయమంటున్నది. అలాంటప్పుడు కొన్న వడ్లను ప్రభుత్వం ఏం చేసుకోవాలి’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన పదేండ్లలో రాష్ట్రంలో వరి సాగు 35లక్షల ఎకరాల నుంచి 127 లక్షలకు పెరిగిందని, అదే సమయంలో కూరగాయల సాగు 5లక్షల ఎకరాల నుంచి లక్ష ఎకరాలకు తగ్గిందని నివేదిక ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో పంటల మార్పిడి అత్యవసరమని నివేదిక ఇచ్చింది. మరోవైపు వ్యవసాయ శాఖ ద్వారా కూడా వరి సాగును తగ్గించే ప్రయత్నాలు చేయిస్తున్నది. ఈ క్రమంలో వరి సాగు చేయొద్దంటూ కాంగ్రెస్ సర్కార్ రైతులకు పిలుపునిస్తున్నది.
వరి సాగు చేయొద్దని గుడ్డి వాదనను వినిపిస్తున్న సర్కార్.. ప్రత్యామ్నాయంపై స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఇప్పటివరకు ప్రత్యామ్నాయ పంటల జాబితాను సిద్ధం చేయలేదు. ఏ పంటలు సాగు చేస్తే బాగుంటుంది, ఏయే పంటలకు డిమాండ్ ఉన్నదనే విషయాలను రైతులకు వివరించలేదు. రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలేమిటి? ప్రత్యామ్నాయ పంటల వల్ల నష్టం రాదనే భరోసా కల్పించాలి. ప్రత్యామ్నాయ పంటల కొనుగోళ్లపై రైతులకు భరోసా మాత్రం ఇవ్వడం లేదు. ఇటు బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లభించక, అటు సర్కార్ కొనుగోలు చేయక రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతున్నది. గడిచిన రెండేండ్ల నుంచి ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో నిత్యం చూస్తునే ఉన్నాం. కేంద్రంపై నెపం నెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేస్తున్నది. కానీ ఇవేవీ చేయకుండా వరి వద్దనడం తగదని నిపుణులు మండిపడుతున్నారు.
ఎన్నికలప్పుడు ఓట్ల కోసం అన్ని పంటలకు బోనస్ ఆశచూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మద్దతు ధర, బోనస్ అటుంచి పంటలు కొనేందుకే చుక్కలు చూపిస్తున్నది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న 420 హామీల్లో పంటలకు మద్దతు ధరకు మించి బోనస్ ఇస్తామనే హామీ కూడా ఒకటి. రైతులు పండించే అన్ని పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, పైగా బోనస్ కూడా చెల్లిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగానే మ్యానిఫెస్టోలో వరి, మక్కజొన్న, కందులు, సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఇలా 10 రకాల పంటలకు బోనస్ ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బోనస్ సంగతి దేవుడెరుగు పంటల కొనుగోళ్లకు ఎగనామం పెట్టే పరిస్థితి ఏర్పడింది. అటు వరి వద్దంటున్న సర్కార్.. ఇటు ఇతర పంటలను కూడా కొనుగోలు చేయడం లేదు. నాడు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తుందని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు పంటల కొనుగోళ్ల భారాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నది. పంటల కొనుగోలు తమ బాధ్యత కాదని, కేంద్రమే కొనాలని డిమాండ్ చేస్తున్నది.