Bhadrachalam LIC | భద్రాచలం ఎల్ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో నిరుపేదలపై ఇన్సూరెన్స్ తీసుకుని.. ఆపై వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి కోట్లు కాజేసినట్లు తెలిసింది. ఈ ఘరానా మోసం ద్వారా దాదాపు రూ.1.52 కోట్లను కాజేసినట్లుగా తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. అశ్వాపురం మండలానికి చెందిన కొంతమంది ఏజెంట్లు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఎల్ఐసీ నిబంధనల్లో లొసుగులను ఆసారాగా చేసుకున్నారు. నేరుపేదల పేరిట నకిలీ పత్రాలతో పాలసీలు తీసుకున్నారు. అనంతరం వారు చనిపోయినట్లుగా తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించారు. అలా కోటిన్నర రూపాయలకు పైగా కాజేశారు. క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సిన యంత్రాంగం సైతం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం గమనార్హం.
అంతా అయిపోయి, ఖజానా ఖాళీ అయ్యాక గానీ ఎల్ఐసీ బ్రాంచ్ నిర్వాహకులకు అసలు విషయం బోధపడలేదు. అంతర్గత తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడటంతో లబోదిబోమంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఇంత భారీ మొత్తంలో నగదు పక్కదారి పడుతున్నా ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించలేకపోయారనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. భద్రాచలం బ్రాంచ్లో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటంతో పాలసీదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బ్రాంచ్ అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో స్కామ్ జరగడం సాధ్యమేనా? నకిలీ పత్రాలతో వెరిఫై చేయడంలో సిబ్బంది ఎందుకు విఫలమయ్యారు? సాధారణ ప్రజలకు క్లెయిమ్ రావాలంటే నెలల తరబడి తిప్పించే అధికారులు, ఈ కేటుగాళ్లకు ఎలా సహకరించారు? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.