యాదాద్రి భువనగిరి (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రధాని మోదీ దుర్మార్గపు పాలనను ఎండగట్టే సమయం ఆసన్నమైందని, ఆ దిశగా గులాబీ శ్రేణులు దండుకట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 12న యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన సీఎం కేసీఆర్ సభకు సంబంధించిన ఏర్పాట్లను గురువారం మంత్రి పరిశీలించారు. ప్రత్యేక రాష్ట్రంగా వేరుపడ్డ తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే బాగుపడటాన్ని చూసి ఓర్వలేక బీజేపీ పాలకులు అక్కసు వెళ్లగక్కుతున్నారని మంత్రి విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు మోదీ వెన్నులో వణుకును పుట్టిస్తున్నాయని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అణచివేసే కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పాలన అద్భుతమని నిన్నమొన్నటివరకు పొగిడిన బీజేపీ పాలకులు నేడు తెలంగాణ రాష్ట్రం మీద విషం కక్కుతున్నారని ఎద్దేవ చేశారు. భువనగిరిలో సీఎం కేసీఆర్ సభను జయప్రదం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
మంత్రి వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నారు.