మద్దూరు : రైతుకు అండగా ఉండేందుకు భూభారతి (Bhu Bharati ) చట్టం తీసుకువచ్చామని, భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భూభారతి ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా మద్దూరు( Maddur) మండల పరిధిలోని ఖాజీపూర్ గ్రామంలో గురువారం భూభారతి పోర్టల్, రెవెన్యూ సదస్సు, గ్రామ సభను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి అండగా ఉండేలా ఈ చట్టం తీసుకువచ్చామని అన్నారు. భూభారతి చట్టం దేశానికి ఆదర్శం కాబోతుందని పేర్కొన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఓ అధికారిని నియమిస్తామని తెలిపారు. రైతు భూముల సమస్యలకు భూభారతితో పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. మొదటి విడతలో 6,000 మంది లైసెన్స్ ఉన్నసర్వేయర్లను నియమిస్తామని వివరించారు.
వచ్చేనెల 2 తేదీ లోపు సర్వేర్లకు శిక్షణ ఇప్పించి భూ రికార్డులు పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు. మే ఒకటో తేదీ నుంచి కలెక్టర్లు ప్రతి మండలంలో చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారని అన్నారు. మే రెండవ తేదీ నుంచి 28 జిల్లాల్లో ఒక్కొక్క మండలం చొప్పున భూభారతి చట్టం అమలు చేస్తామని ప్రకటించారు. జూన్ రెండవ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టం అమలులోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.