తలసరి ఆదాయంలో నంబర్ 1
ఆర్థిక వృద్ధిలో నంబర్ 1
పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ 2
వ్యవసాయరంగ వృద్ధిలో నంబర్ 2
పెద్ద రాష్ర్టాల్లో నంబర్ 4
రోడ్లు, మౌలిక సదుపాయాల్లో నంబర్ 4
విద్యారంగంలో నంబర్ 5
గ్రామీణ మహిళా ఆర్థిక సాధికారతలో నంబర్ 5
దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 5%
కరోనా వేళ సైతం వృద్ధిరేటు 2.4%
వ్యవసాయ రంగంలో వృద్ధి 18.5%
ఇవి కేవలం అంకెలు కావు! అనేక కొలమానాల్లో తెలంగాణ సాధించిన నిరుపమాన అభివృద్ధికి సాక్ష్యాలు!
మొన్నటిదాకా అట్టడుగు స్థానాల్లో పడి ఉన్న తెలంగాణ.. నేడు ఏటికి ఎదురీదుతూ.. ప్రగతిబాటలో ఉవ్వెత్తున ఎగిసిన తీరుకు నిదర్శనాలు! దార్శనికుడి పాలనలో.. కొత్త రాష్ట్రం సాధించిన పురోగతికి నిలువుటద్దాలు!
ఇవి ఇండియా టుడే పత్రిక..
వివిధ రాష్ర్టాల పరిస్థితులను విశ్లేషించి బయటపెట్టిన వాస్తవాలు!!
తెలంగాణ ఆర్థిక ప్రగతికి ఇండియా టుడే సర్వే మరోసారి పట్టం కట్టడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టాన్ని చూసి గర్విస్తున్నానని తెలిపారు.
‘తెలంగాణను, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని చూసి గర్విస్తున్నా. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సారథ్యం వల్లే ఇది సాధ్యమైంది. హ్యాట్సాఫ్’ అని మంత్రి కేటీఆర్ శనివారం ట్వీట్ చేశారు. ఇండియా టుడే మ్యాగజైన్ లింక్‌ను షేర్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్థిక ప్రగతిలో తెలంగాణ జోరుగా ముందుకు సాగుతున్నట్టు మరోసారి రుజువైంది. జాతీయ పత్రిక ‘ఇండియా టుడే’ తాజాగా నిర్వహించిన ‘స్టేట్ ఆఫ్ ద స్టేట్స్’ సర్వేలో మన రాష్ట్రం పలు కీలక విభాగాల్లో అగ్రగామిగా నిలిచింది. ముఖ్యంగా పెద్దరాష్ర్టాల్లో ఆర్థిక వృద్ధి పరంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టు ప్రకటించింది. తలసరి ఆదాయంలోనూ తెలంగాణదే మొదటి స్థానమని ఆ పత్రిక వెల్లడించింది. మోస్ట్ ఇంప్రూవింగ్ రాష్ర్టాల జాబితాలో సైతం తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని ప్రశంసించింది. కరోనా విపత్తులోనూ పాజిటివ్ వృద్ధిరేటును నమోదు చేసిందని కీర్తించింది. రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన ఈ పత్రిక.. భౌగోళిక విస్తీర్ణాన్ని బట్టి 20 రాష్ర్టాలను ‘పెద్ద రాష్ట్రాలు’గా, 10 రాష్ర్టాలను ‘చిన్న రాష్ర్టాలు’గా విభజించింది. మొత్తం 12 కీలక అభివృద్ధి సూచికల ఆధారంగా వీటికి ర్యాకులు ఇచ్చింది.
కరోనా కాలంలోనూ..
ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా విపత్తులోనూ తెలంగాణ పాజిటివ్ వృద్ధిరేటును నమోదు చేసిందని, రాష్ట్ర ఆర్థిక పటిష్టతకు ఇదే నిలువెత్తు నిదర్శనమని కొనియాడింది. దేశంలో విస్తీర్ణం పరంగా తెలంగాణ 11వ స్థానంలో, జనాభా పరంగా 12వ స్థానంలో ఉన్నా దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందని వెల్లడించింది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతమని, దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నదని గుర్తుచేసింది. తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్ మాత్రమే తెలంగాణ కన్నా ముందున్నాయని తెలిపింది.