రిషికేశ్: ఉత్తరాఖండ్ రిసార్టులో 19 ఏండ్ల రిసెప్షనిస్ట్ హత్యకు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. హత్యకు గురికావడానికి ముందు బాధితురాలు తన స్నేహితురాలితో ఫేస్బుక్లో చేసిన చాటింగ్ బయటకు వచ్చింది. ఆ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా రిసార్టుకు చెందిన ఓ ఉద్యోగినితో బాధితురాలు ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డు కూడా నెట్టింట వైరల్‌గా మారింది.
ఫేస్బుక్ చాటింగ్‌లో బాధితురాలు రిసార్టులో తన పరిస్థితి గురించి స్నేహితురాలికి వివరించింది. రిసార్టు ఓనర్ తనను వ్యభిచారం చేయాలని బలవంతపెడుతున్నాడని పేర్కొంది. రిసార్టుకు వచ్చే గెస్టులకు ప్రత్యేక సేవలు అందించమంటున్నాడని, అలా చేస్తే గెస్టుకు రూ.10 వేల చొప్పున పారితోషికం ఇస్తానంటున్నాడని తెలిపింది. ఈ మెసేజ్‌లను ఆమె స్నేహితురాలు స్క్రీన్ షాట్లు తీసి ఆన్లైన్లో పెట్టింది.
అంతేగాక బాధితురాలు ఏడుస్తూ రిసార్టులోని మరో మహిళా ఉద్యోగినికి చేసిన ఫోన్‌కాల్ కూడా ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఫోన్లో ఏడుస్తూనే వేరే ఎవరితోనో తన బ్యాగ్‌ను మీదకు తీసుకురమ్మని అన్నట్లుగా ఆ ఆడియోలో రికార్డయింది. గెస్టుల కోసం బాధితురాలితో వ్యభిచారం చేయించేందుకు రిసార్టు ఓనర్ ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.