బెంగళూరు: నిలకడైన ప్రదర్శనతో దూసుకెళ్తున్న బెంగళూరు బుల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో నాలుగో విజయం ఖాతాలో వేసుకున్న బెంగళూరు 23 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో బెంగళూరు 40-29తో పుణెరి పల్టన్‌పై గెలుపొందింది. బెంగళూరు కెప్టెన్ పవన్ షెరావత్ (11 పాయింట్లు) ఈ సీజన్లో నాలుగోసారి సూపర్-10 సాధించగా.. చంద్రన్ రంజిత్ (6), భరత్ (5) అతడికి సహకరించారు. పుణెరి తరఫున అస్లమ్ (6), మోహిత్ (6) పోరాడినా ఫలితం లేకపోయింది. వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమి పాలైన పల్టన్.. 5 పాయింట్లతో పట్టికలో అట్టడుగున కొనసాగుతున్నది. మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 38-36తో గుజరాత్ జెయింట్స్‌పై విజయం సాధించింది.