మునుగోడు, మే 26 : నిరుపేదలకు సొంతింటి కలను సాకరం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలి విడుతలో రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో భాగంగా మునుగోడు మండలంలో గుండ్లోరిగూడెం గ్రామం ఎంపికైంది. ఈ గ్రామంలో 17 మంది లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలు అందజేశారు. కాగా నేటికి ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఊపందుకోలేదు. చేతిలో చిల్లి గవ్వలేని నిరుపేద లబ్ధిదారులు ముగ్గు పోసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆరా తీయగా గృహ విస్తీర్ణం 600 చదరవు అడుగులకు పరిమితం చేయడం కూడా ఈ పథకం ప్రగతికి ప్రతిబంధకం అవుతోందనే అభిప్రాయం వ్వక్తమవుతోంది. దీనికి తోడు సిమెంట్, ఇసుక, స్టీలు వంటి వాటి ధరలు భారీగా పెరగడంతో లబ్ధిదారులు పనులను ప్రారంభించడంలో వెనకడుగు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం ఎంపీడీఓ విజయ్‌భాస్కర్ తన సిబ్బందితో గుండ్లోరిగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించగా కేవలం ఐదుగురు లబ్ధిదారులు మాత్రమే ముగ్గుపోసి బేస్మెంట్ లెవల్ వరకు నిర్మించారు. దీంతో ఎంపీడీఓ మిగితా లబ్ధిదారుల దగ్గరికి వెళ్లి వాళ్లకు అవగాహన కల్పించారు. బేస్మెంట్ లెవల్ రూ.1 లక్ష, స్లాబ్ రూ.1లక్ష, గోడల నిర్మాణానికి రూ.2 లక్షలు, ప్లాస్టింగ్ కు రూ.1 లక్ష ప్రభుత్వం చెల్లిస్తుందని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ స్వరూపరాణి, గ్రామ కార్యదర్శి పుష్ప, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.