రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానాయికలు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నటుడు చిరంజీవి క్లాప్‌నివ్వగా, తేజ్ నారాయణ కెమెరా స్విఛాన్ చేశారు. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర ప్రీలుక్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘మా నాన్నగారి ద్వారా స్టువర్టుపురం నాగేశ్వరరావు గురించి చాలా విషయాలు తెలుసుకున్నా. చీరాల ప్రాంతం వారు ఆయన్ని హీరోగా కొనియాడేవారు. ఈ సినిమాలో రవితేజ నటించడం ఆనందంగా ఉంది’ అన్నారు. రవితేజతో నాలుగేళ్లుగా ప్రయాణం చేస్తున్నానని, ఆయనకు పక్కాగా కుదిరిన కథ ఇదని దర్శకుడు వంశీ పేర్కొన్నారు. రేణుదేశాయ్ మాట్లాడుతూ ‘2019లో దర్శకుడు సినిమాలోని నా పాత్ర గురించి చెప్పారు. అప్పుడు నటించాలనే ఆలోచన లేదు. కానీ క్యారెక్టర్ నచ్చడంతో ఈ సినిమా చేయాలనే ఉత్సాహం వచ్చింది’ అని చెప్పింది. తెలుగు ప్రేక్షకులందరూ సినిమాను ఆశీర్వదించాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ కోరారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్ మదీ, సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్, సమర్పకుడు: తేజ్ నారాయణ్ అగర్వాల్, రచన-దర్శకత్వం: వంశీ.