Artificial Intelligence | వినిపించే గొంతుక మీది కాకపోవచ్చు. కనిపించే ఆకారమూ మీది కాకపోవచ్చు. అయినా మీరే అన్నట్టు నమ్మిస్తారు. మీ ఆత్మీయుల నుంచి డబ్బు రాబడతారు. మీ సహచరుల నుంచి కీలక కార్పొరేట్ సమాచారం చేజిక్కించుకుంటారు. చాట్ జీపీటీలాంటి అద్భుత ఆవిష్కరణలకు మూలమైన కృత్రిమ మేధ.. అనేక అరాచకాలనూ ఉసిగొల్పుతున్నది.
బాబాయ్! ఆఫీస్ పనిమీద ముంబై వచ్చాను. లోకల్ ట్రైన్లో పర్సు పోయింది. కార్డులు కూడా అందులోనే ఉన్నాయి. నీకో నంబరు పెడతాను. పాతికవేలు పంపించు. రాగానే తిరిగి ఇచ్చేస్తా’ సొంత అన్నకొడుకు వీడియో కాల్ చేసి అడుగుతుంటే.. కాదని ఎలా అనగలడు? తన దగ్గర ఉన్నది కొంత, స్నేహితుడి దగ్గర చేబదులు తీసుకున్నది ఇంకొంత.. మొత్తం కలిపి పంపాడు. వారం రోజుల తర్వాత అన్నగారి అబ్బాయి టూర్ నుంచి వచ్చాడు. ఇంటికొచ్చి మరీ పలకరించి వెళ్లాడు. ముంబై కబుర్లు చాలానే చెప్పాడు.. తాను డబ్బు అడిగిన విషయం, తనకు ఆ డబ్బు ముట్టిన సంగతి మినహా. రెండుమూడు నెలలు గడిచినా.. స్పందన లేదు. ఇక తప్పలేదు. ఓ ఆదివారం భోజనానికి పిలిచి మరీ చేబదులు విషయం గుర్తు చేశాడు.
అబ్బాయి షాకు. బాబాయి అవాక్కు.
ఇదో అచ్చమైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ నేరం. ఏఐ సాయంతో వాయిస్ క్లోన్ చేశారు నేరగాళ్లు. దీంతో అబ్బాయి మాట్లాడినట్టే మాట్లాడగలిగారు. క్రెడిట్‌కార్డు ఇస్తామంటూనో, పర్సనల్ లోన్ మంజూరు చేస్తామంటూనో మీకొచ్చే ఫోన్‌కాల్స్‌లో కొన్నిటిని కేవలం మీ వాయిస్ రికార్డు చేసుకోడానికే చేస్తారు ఇ-క్రిమినల్స్. ఆ స్వర నమూనాలనే మోసాలకు ముడిసరుకుగా వాడుకుంటారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసే ఫొటోలు వాడుకుని కృత్రిమమేధ సాయంతో.. మీ ‘అవతార్’ను సృష్టిస్తారు. అవతలి వ్యక్తి స్క్రీన్ మీద మీ ఫోన్ నంబరు కనిపించేలా చేయడం పెద్ద కష్టమేం కాదు. ఇందుకూ కొన్ని యాప్స్ ఉన్నాయి. ఇంకేముంది, మీ ఆత్మీయులకు వీడియో కాల్ చేసి డబ్బు పంపమని అడుగుతారు. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ మీద మీరే కనిపిస్తారు, మీ స్వరమే వినిపిస్తుంది. హావభావాలు, సంబోధనలు.. ఎక్కడా ఏ చిన్న అనుమానమూ రాదు. ఎంతటివారైనా ఇట్టే బుట్టలో పడిపోతారు. కాబట్టి, బంధుమిత్రుల నుంచి ఆర్థిక సాయం కోసం ఫోన్లు వచ్చినప్పుడు.. ఒకటికి పదిసార్లు తనిఖీ చేసుకోవాలి. చెప్పింది వినడమేకాదు, మనమూ సంభాషించాలి. చేయి పైకెత్తమనో, ముక్కు గిల్లుకోమనో అడగాలి. నవ్వులాటలా అనిపించవచ్చు కానీ, అవతల ఉన్నది అసలు మనిషా, కృత్రిమ అవతారమా అనేది నిగ్గు తేల్చుకోడానికి ఇంతకు మించిన దారి లేదు. అవసరమైతే కాల్ కట్ చేసి.. తిరిగి మనం ఫోన్ చేయాలి. సదరు వ్యక్తితో మాట్లాడి నిర్ధారించుకోవాలి.
తప్పని గురి..
కృత్రిమ మేధతో ఎన్ని అద్భుతాలు సాధ్యమో, అన్ని మోసాలకూ ఆస్కారం ఉంది. సాధారణ సైబర్ నేరాలు చెరువులో వల విసిరినట్టు ఉంటాయి. నీటిలో వల వేస్తే ఏమవుతుంది? లక్ష చేపల్లో వంద చేపలు చిక్కుకుంటాయి. అందులోనూ ఓ పాతిక చివరి నిమిషంలో తెలివిగా తప్పించుకుంటాయి. కానీ కృత్రిమ మేధ ఆధారంగా జరిగే నేరాలు అలా కాదు.. పక్కాగా గురిపెట్టినట్టు ఉంటాయి. ఒకే వ్యక్తిని టార్గెట్ చేస్తాయి. అతణ్ని ఆర్థికంగా దెబ్బతీస్తాయి, పేరుప్రతిష్ఠలకు మచ్చ తెస్తాయి. మానసికంగా కుంగదీస్తాయి. అంతిమంగా ఆత్మహత్యకూ పురిగొల్పవచ్చు. అంతటి తీవ్రత ఉంటుంది. సోషల్ మీడియాలో మీరు పెట్టిన ఫొటోలు, కామెంట్ల ఆధారంగా మీ గురించి ఓ అంచనాకు వస్తారు. మీ పాత్రతో మీలా మాట్లాడిస్తారు. మరెవరితోనో మీరు పడకగదిలో ఉన్నట్టు భ్రమింపజేస్తారు. ఫలానా వ్యక్తి గురించి, సంస్థ గురించి, రాజకీయ పార్టీ గురించి మీరు అవాకులు చవాకులు పేలుతున్నట్టు రూపొందిస్తారు. ఇక్కడ ఏదైనా సాధ్యమే. ఎవరినైనా బలి పశువులను చేయవచ్చు. సినీనటి రశ్మిక మందన్న విషయంలో జరిగింది కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ మాయా జాలమే. ఎన్నికల సీజన్లో ప్రత్యర్థుల మీద ఈ తరహా దాడులు చేయడానికి రాజకీయ పార్టీలు ఏఐ నిపుణులను నియమించుకుంటున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఫేక్ న్యూస్‌ను సృష్టించడంలో, ప్రచారం చేయడంలో కృత్రిమమేధ కీలక సాధనంగా మారుతున్నది.
కార్పొరేట్ ప్రపంచంలోనూ
కార్పొరేట్ ప్రపంచం ఏఐ నేరాల ముప్పునకు చేరువలో ఉంది. ఎవరో గిట్టనివారు, ఫలానా కంపెనీ ఆర్థిక పరిస్థితి గురించి సీఈవో స్థాయి వ్యక్తి ఆందోళన చెందుతున్నట్టుగా ఫేక్వీడియోను సృష్టించి.. జనంలోకి వదలడం వల్ల ఆ సంస్థ షేర్స్.. స్టాక్ మార్కెట్లో నేల చూపులు చూస్తాయి. విశ్వసనీయత కూడా పడిపోతుంది. అవన్నీ కేవలం పుకార్లే అన్న విషయం జనంలోకి వెళ్లి సాధారణ పరిస్థితులు నెలకొనేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందులోనూ మన దగ్గర బలమైన ప్రైవసీ యాక్ట్ లేకపోవడం వల్ల ఇలాంటి దురాగతాలకు హద్దు లేకుండాపోయింది. ఊరూపేరూలేని అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోకుండా ఉండటం, వ్యక్తిగత సమాచారాన్ని, ఫొటోలను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచటం, ప్రతి అకౌంట్‌కు ‘టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్’ ఎంచుకోవడం, పబ్లిక్ వైఫై వాడకపోవడం.. తదితర జాగ్రత్తలతో ఈ నేరాలను అరికట్టవచ్చు.
– అనిల్ రాచమల్ల, వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్
Tech Tips | ఫేస్బుక్లో స్పామర్ల బారిన పడి మోసపోవద్దంటే ఈ టిప్స్‌ను కచ్చితంగా పాటించండి
Tech Tips | మీ ఫోన్ పోయిందా? సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు మస్ట్!