మేడ్చల్, డిసెంబర్12(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ బీసీ వేల్ఫేర్ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థులు పాఠశాల సమస్యలపై పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన ఘటనలో డిప్యూటీ వార్డెన్ ఓంప్రకాశ్‌పై బీసీ వెల్ఫేర్ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రిన్సిపాల్ రవికుమార్‌ను బదిలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
పురుగుల అన్నం, వంటపాత్రల అపరిశుభ్రత, నీటి సమస్యతోపాటు బాత్రూమ్లకు డోర్లు లేని విషయాన్ని విద్యార్థులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి ఝాన్సీరాణి, డీఎస్వో శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నివేదికను కలెక్టర్ మనూచౌదరికి నివేదించారు.
గురుకుల పాఠశాలల్లో వరుస ఘటనలు జరుగుతున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిరుపేద పిల్లలు చదివే గురుకులాలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోదా? అని ప్రశ్నిస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోనే మూడు ఘనటలు చోటుచేసుకున్నాయంటే, ప్రభుత్వం ఈ పాఠశాలలపై ఏమేర దృష్టి సారిస్తుందనేది అర్థమవుతున్నదని ధ్వజమెత్తుతున్నారు.