హైదరాబాద్ సిటీబ్యూరో/ చిక్కడపల్లి/సుల్తాన్‌బజార్/మాదాపూర్/ కొండాపూర్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఒకేరోజు 66 మంది విద్యార్థులు కలుషితాహారం తిని అస్వస్థతకు గురయ్యారు. బాగ్‌లింగంపల్లిలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో గురువారం రాత్రి పాడైపోయిన పెరుగును ఆహారంలో ఇవ్వడంతో 22 మంది చిన్నారులు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మాదాపూర్ పరిధిలోని చంద్రానాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో కలుషితమైన పాయసం తిని 44 మంది విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. అన్ని వసతులూ అందుబాటులో ఉండాల్సిన మహానగరంలోనే ఒకేరోజు 66 మంది విద్యార్థులు కలుషితాహారం బారినపడ్డారు. విద్యార్థులకు కింగ్‌కోఠి, నిలోఫర్, కొండాపూర్ దవాఖానలు, రెయిన్బో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. తమ పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదోనని తల్లిదండ్రులు గురుకుల, ప్రభుత్వ పాఠశాల, దవాఖానల చుట్టూ తిరిగి ఆందోళన చెందారు.
బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకులంలో 337 మంది విద్యార్థినులు చదువుతున్నారు. గురువారం రాత్రి భోజనంలో బీరకాయ పప్పు, క్యారెట్ వేపుడు, సాంబార్, పెరుగు పెట్టారు. భోజనం తిన్నతర్వాత తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. వారిని అంబులెన్స్‌లో కింగ్‌కోఠి, నిలోఫర్ దవాఖానలకు తరలించారు. పాడైన పెరుగు తినడం వల్లే ఆస్వస్థతకు గురైనట్టు విద్యార్థినులు తెలిపారు. ఘటన గురించి తెలిసి తల్లిదండ్రులు గురుకుల పాఠశాల వద్దకు, దవాఖానల వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తంచేశారు.
చంద్రానాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కలుషితం కావడంతో 44 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్న భోజనంలో అన్నం, ఆలుగడ్డ కూర, పప్పు, పాయసం అందజేశారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో అవస్థలు పడ్డారు. పాఠశాలలో మొత్తం 107 మంది విద్యార్థులు ఉండగా 44 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయులు అంబులెన్స్ ద్వారా 38 మందిని కొండాపూర్ ఏరియా దవాఖానకు తరలించారు. ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నానక్‌రాంగూడలోని రెయిన్బో దవాఖానకు తరలించి చికిత్స అందించారు. మధ్యాహ్న భోజనంలో పాడైన పాయసం తినడం వల్లనే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తున్నది.
44 మందికి విద్యార్థులు అస్వస్థతకు గురైనా ఉపాధ్యాయులు తమకు సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు చెప్తున్నారు. సాయంత్రమైనా తమ పిల్లలు ఇంటికి రాకపోవడంతో 5 గంటలకు తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. అప్పుడు ఫుడ్ పాయిజన్ అయిందని, దవాఖానకు తరలించినట్లు తెలిపారని వాపోయారు. తమ పిల్లలు అస్వస్థతకు గురైనా సమాచారం ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏదైనా జరగకూడనిది జరిగినా ఇలానే వ్యవహరిస్తారా? అని మండిపడ్డారు.
హెడ్మాస్టర్ సుమిత్రకు ఎలక్షన్ డ్యూటీ ఉండటంతో పాఠశాలకు రాలేదని, ఇతర ఉపాధ్యాయుల వద్ద తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు లేకపోవడంతో సమాచారం ఇవ్వలేదని ఎంఈవో వెంకయ్య తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను కొండాపూర్ ఏరియా దవాఖాన, నానక్‌రామ్ గూడలోని రెయిన్బో దవాఖానలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ నాయకులు భిక్షపతి ముదిరాజ్, లక్ష్మణ్ తదితరులున్నారు.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన విద్యార్థులకు పాడైన భోజనం పెట్టి వారి ప్రాణాలతో చెలగాటమాడుతారా? అని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మండిపడ్డారు. బాగ్‌లింగంపల్లి మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఆయన స్పందిస్తూ విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో నిర్లక్ష్యం తగదని సూచించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి సకల వసతులు కల్పించిందని గుర్తుచేశారు. 2016లో బాగ్‌లింగంపల్లి మైనార్టీ గురుకులాన్ని ఏర్పాటు చేయగా బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. నాడు విద్యార్థులకు నాణ్యమైన విద్య, మంచి ఆహారం అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను, విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయని మండిపడ్డారు.