వికారాబాద్, నవంబర్ 2: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (బీసీ కుల గణన) అంశంపై శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. స్టేజీపైన కూర్చున్న వారిలో చాలా మంది రెడ్డి సామాజికవర్గం వారే ఉండటంతో మిగిలిన వర్గాల వారు మనసు నొచ్చుకుని మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ మీటింగ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరగగా.. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్‌రెడ్డి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. స్టేజీ నిండా నాయకులున్నా.. ముందు ఏర్పాటు చేసిన కుర్చీలు మాత్రం ఖాళీగా దర్శనమిచ్చాయి. కుల గణనకు ఇండ్లు, భూములు, వాహనాలు తదితర వాటి వివరాలను ఇవ్వాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొన్నారు.