పిల్లల కేరింతలతో
ఇల్లు ఆనందడోలికలూగాలని..
ఆత్మీయత కరువైన గుమ్మానికి
నవ్వుల తోరణాలు కట్టాలని..
ప్రతి ఇల్లూ నందనవనమై వెల్లివిరియాలని..
అడివమ్మను అడిగి చెట్టు చెట్టు తిరిగి
బుట్ట నిండా తెచ్చుకున్న రంగులతో
నవ్వులొలికించే తీరొక్క పూలు!
ఒక్కొక్క రంగును చూస్తే
నాకళ్ళు అరమోడ్పులయ్యాయి
మేనిఛాయలో ఒదిగిపోయే తంగేడులు
మంచుముద్దలు రాలినట్లు గునుగు పూలు
సందె కాంతిని తలపించే మందారాలు
రేరాజు రాకకై ఎదురుచూసే కలువ భామలు
రంగు రంగుపూలనూ వేరుచేసి వలయాలుగా పేర్చిన
నా ముని వేళ్లను కుంచెగా చేసి మెరుగులద్దిన
హరివిల్లు లాంటి బతుకమ్మలు
నా చేతిలో అపురూపంగా
ఒద్దికగా ఒదిగిపోయాయి!
ఆడపడచుల కాలి మువ్వల సవ్వడులు
ఊరూ వాడా కలిసి సయ్యాటలు
కోకిలమ్మల గానాలతో సందళ్ళు
ఉద్యమాలకు ఊపిరి పోసి
ఊరేగింపులలో తోడూ నీడై
మా అస్తిత్వాన్ని నిలిపింది బతుకమ్మ
తెలంగాణ తల్లి చేతిలో నిలిచి
సల్లగా బతుకుమని దీవించే
పెద్దముత్తయిదువైంది!
తీరొక్క పూలతో రోజుకో సద్దితో
తొమ్మిది రోజుల పండుగ చేసి తృప్తి పరుస్తాం
మా ఇండ్లల్ల కొలువై
మా బతుకుల్లో రంగులు నింపే బతుకమ్మ!!
ప్రతి ఏటా వచ్చి పూల జాతరలో
మా పూజలందుకొని
ముత్తయిదువులుగా ఉండాలని
మము దీవించమ్మా గౌరమ్మా!!
జయంతి వాసరచెట్ల: 9985525355