ఆలేరు టౌన్, సెప్టెంబర్ 26 : బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకే కాకుండా రాష్ట్రంలోని మహిళలందరికీ చీరలు పంపిణీ చేయాలని పీఓడబ్ల్యూ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు ఆర్.సీత, ప్రధాన కార్యదర్శి మాలోత్ సుగుణ అన్నారు. శుక్రవారం మీడియాతో వారు మాట్లాడుతూ.. బతుకమ్మ మహిళలకు ప్రత్యేకమైన పండగ అన్నారు. అలాంటి బతుకమ్మ పండుగకు రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ చీరలు ఇవ్వకుండా పొదుపు సంఘాలలో ఉన్న మహిళలకే ఇస్తామని చెప్పడం బాధాకరమన్నారు. బతుకమ్మ పండుగకు ముందే ప్రతి ఆడపడుచుకు ప్రభుత్వం చీరెలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని, లేనట్లయితే ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ), ఇతర మహిళా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు.