తెలంగాణ సాధన పోరాటంలో బతుకమ్మ ఓ ఆయుధమైంది. ఈ నేల ఆడపడుచులంతా బతుకమ్మను ఎత్తుకొని ‘ఉయ్యాలో ఉయ్యాలో’ అంటూ తమ మనసులోని కాంక్షలను ఆటపాటల్లో వ్యక్తం చేసి ‘మా బతుకులు వేరు, మా సంస్కృతి వేరు’ అని లోకానికి చాటిచెప్పారు. అప్పటి వరకు ప్రజల్లో వేడుకలా సాగిన బతుకమ్మ స్వరాష్ట్రం సాకారంతో ప్రభుత్వంలో భాగమైంది, ఓ బాధ్యత అయింది. తెలంగాణ తల్లి విగ్రహంలో సింగారమైంది. మహిళల రుణం తీర్చుకొనే విధంగా నాటి ప్రభుత్వం బతుకమ్మ పండుగ నాడు కొత్త రాష్ట్రంలో మహిళలందరూ కొత్త బట్టలతో సంబరాలు చేసుకోవాలని ఉచిత చీరల పంపిణీని ఆరంభించింది.
2017లో మొదలైన బతుకమ్మ చీరల పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు లాభసాటి వ్యాపారంతో పాటు అమ్మలక్కలకు ఆసరాగా నిలిచినట్టయింది. ఆనాటి నుంచి కనీస వయసు 18 ఏండ్లున్న ప్రతి ఆడపడుచుకు రేషన్‌కార్డు ఆధారంగా పండుగ వేళ చీరలు అందజేసింది. ఈ పథకం ద్వారా కోటి చీరల ఉత్పత్తి కోసం మగ్గాలకు పని దొరికింది. ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.350 కోట్లు చేనేత సంఘాలకు అందజేసేది. వీటితో పాటు బడి పిల్లలకు రెండు జతల యూనిఫామ్‌లు ఉచితంగా అందజేయడంతో నేతన్నలకు మరింత ఉపాధి కల్పన జరిగింది. చేనేత, పవర్లూమ్, పాలిస్టర్ బట్టల పరిశ్రమకు ప్రభుత్వం ఏటా రూ.550 కోట్ల దాకా అందించడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులొచ్చాయి. అలా బతుకమ్మ చీరల పథకం రెండు రకాల ప్రయోజనాలను సాధించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో బతుకమ్మ చీరల పథకానికి గ్రహణం పట్టినట్టయింది. 2024లో బతుకమ్మ చీరల సంగతే మరిచిపోయింది. ‘వచ్చే సంవత్సరం చూద్దాం లే’ అని దాటవేసి, ఈ సారి కూడా బతుకమ్మ చీరల ముచ్చట మంత్రులు, అధికారుల తర్జనభర్జనల వద్దే ఆగిపోయింది. ఫిబ్రవరిలోనే రూ.380 కోట్లను చీరల తయారీ కోసం కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. పండుగ ముందు నుంచి ఇప్పుడు, అప్పుడు అంటూ ప్రభుత్వ ప్రకటనలే తప్ప సమయానికి చీరలు మాత్రం ఆడపడుచులకు అందలేదు. ఈ పండుగకు ఒకటి కాదు, రెండు చీరలు ఇస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలు కల్లలయ్యాయి. అయితే బతుకమ్మ కానుకగా ఇందిరా మహిళా శక్తి పేరుతో ఆడపడుచులకు చీరల పంపిణీ చేయనున్నట్టు ఈ మధ్య ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందిరాగాంధీ బొమ్మతో కవర్లు తయారైన సమాచారం కూడా పత్రికల్లో వచ్చింది. ‘ఇదిగో ఇస్తున్నాం’ అనేలా మంత్రుల ప్రకటనలు కూడా వెలువడ్డాయి.
అయితే ప్రభుత్వం ముందస్తుగా నేతన్నలకు ఆర్డర్లు, అడ్వాన్సులు ఇవ్వకపోవడంతో వారు సమయానికి చీరలను అందించలేకపోయారు. పంతులు వచ్చే దాకా పండుగ ఆగుతుందా అన్నట్టు సమయానికి పండుగ రానే వచ్చింది. ఆడపడుచులకు సర్కారు చీర, సారె అందకుండానే వెళ్లిపోయింది. చీరలు సిద్ధం కాకపోవడంతో పంపిణీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం చల్లగా ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఆలోచన మరోలా ఉంది. ఈ పథకానికి కాంగ్రెస్ ముద్రవేయాలని కుట్ర చేసింది. ఇందిరాగాంధీ జయంతి అయిన నవంబర్ 19 నాడు ఈ చీరల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణ ప్రజల ఆరాధ్య బతుకమ్మ స్థానంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని చేర్చే ఈ నిర్ణయం పూర్తిగా అభ్యంతరకరమైనదే. బతుకమ్మ చీరల పంపిణీకి ఒక సందర్భం, అర్థం ఉంది. వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ బతుకమ్మ పండుగకు ముందు తెలంగాణ ఆడపడుచులకు అందజేయవలసిందే. అది తెలంగాణ ఉద్యమంలో నడుం బిగించిన మహిళా శక్తి రుణం తీర్చుకునే వాయినమే. అందులో ఎలాంటి మార్పు జరిగినా అది తెలంగాణ అస్తిత్వానికే అవమానకరం. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఇందిరమ్మ పేరిట ఏమైనా ఇవ్వాలనుకుంటే అందుకు మరో కొత్త పథకాన్ని రచించుకోవచ్చు.
బతుకమ్మ పేరిట ఉన్న చీరల పంపిణీ పథకం పేరు మార్పును ప్రజలు ఒప్పుకోరు. మరో విషయమేమిటంటే ప్రజలు తమకు ఇష్టమైన రోజున పండుగ చేసుకుంటారు, కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వ హుకుం ఉండకూడదు. బతుకమ్మను వదిలేసి తెలంగాణ మహిళలు ఇందిరమ్మ పుట్టిన రోజున కొత్త బట్టలు కట్టుకోవాలనడంలో ఓ బానిస భావన ఉంది. అది ఆ పార్టీవారికే పరిమితం అవ్వాలే తప్ప, ప్రజలపై రుద్దవద్దు.
బీఆర్ఎస్ హయాంలో ప్రతి బతుకమ్మ పండుగకు కోటి మంది మహిళలు కొత్త చీరలు అందుకున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా వాటి పంపిణీ జరిగేది. ఇప్పుడు కేవలం స్వయం సహాయ సంఘాల సభ్యులకే చీరలు అందిస్తామని సెప్టెంబర్ 9న ఓ సభలో సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్రం మొత్తంలో ఆయా సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని కోటి మంది మహిళల్లో 35 లక్షల మంది చీరలకు నోచుకోరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరంభించిన అన్ని సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచినట్టే ఈ పథకాన్ని కూడా కాంగ్రెస్ మోసానికి గురవుతున్నది. సిరిసిల్లలోని నేత కార్మికులకు చేతినిండా పని కల్పిస్తామన్న హామీ ఉత్తదే అయింది. పథకాల అమలు, హామీల సాకారం ఎలా ఉన్నా ఇందిరమ్మ రాజ్యంలో బతుకమ్మ గౌరవం ఏ మాత్రం తగ్గకూడదు.